లక్ష్యం నుండి లక్షణానికి తొవ్వ చూపిన నలిమెల

Target-to-characteristic compression”తెలంగాణ బతుకు వేరే. తెలంగాణ భాష వేరే. ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తె అవుతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నోసార్లు చెప్పిన. భాష రెండు తీర్లు – ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల బాష. పలుకుబడుల భాష గావాలె”, అన్న కాళోజీ మాటల సారం తెలిసి ఆయన పేరు మీద తెలంగాణ భాషాదినోత్సవం జరుపుడు, ఆయన పేరుతోని పురస్కారం ఇచ్చుడు తెలంగాణ భాషకు గౌరత. ఈ సంవత్సరం ఈ పురస్కారం బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌ కు అందజేస్తమని ప్రకటించుడు పురస్కారానికి వన్నె. పద్నాలుగు భాషలు మనుసున పట్టిచ్చుకొని మాట్లాడుడు, రాసుడు, అనువాదాలు చేసుడు ఒకెత్తు. ఇంకోదిక్కు తెలంగాణ భాషను చల్లకుండలెక్క చిలికి వెన్నతడిని పంచుడు ఇంకొకెత్తు.
976ల తెలంగాణ భాషల ‘రాతి గుండెలు’ కవిత రాసిన తను, 1977ల తెలంగాణ పలుకుబడిల ‘మంద’ కథ రాసిన తను, ద్రావిడ భాషలైన తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సామెతల మీద పరిశోధన చేసిన తనకు ఒక రంది పట్టుకున్నది. తెలంగాణ ప్రజల భాష మీద పడ్డ ముద్ర ఎంత తప్పో తెలియజెప్పాల్ననే రేషం మొదలైంది. 2001ల సిద్ధిపేట మంజీర రచయితల సంఘం సభ, వరంగల్‌ తెలంగాణ రచయితల వేదిక సభల తెలంగాణ భాష ఎంత అర్థవంతమైందో చెప్పుడు షురూ చేసిండు.
శ్రీ శ్రీ అన్నట్టుగ నలిమెల తెలంగాణ పలుకుబడులకై ”విన్నవి కన్నవి విన్నవించగా, మాటలకై వెదుకాడగబోతే, అవి పుంఖాను పుంఖాలుగా, శ్మశానాలవంటి నిఘంటువులు దాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్ప పరిష్వంగం వదలి, వడిగా, వడివడిగా, వెలువడినై, పరుగిడినై”. ప్రజల భాషను జీర్ణం చేసుకోని లక్షణ, భాషా శాస్త్రాలు, నిఘంటువులు, వ్యాకరణాలను వదిలి నలిమెల గళం నుంచి, కలం నుంచి ఉపన్యాసాలై, వ్యాసాలై అడుగిడినై. జనుల నోటి ముత్యాలు పుస్తకాన పలువరుసలై ముసిముసి నవ్వులు నవ్వినై. తెలంగాణ ప్రజల భాషకు మొదటి రిఫరెన్సు పుస్తకం తెలంగాణ పదకోశం (2003)ల అచ్చు అయింది. ఇది తెలంగాణ ఉద్యమకారులకు ఒక కరదీపిక అయింది. కమ్మలనిండ కమ్మటి తెలంగాణ భాష పరిమళం గుప్పుమన్నది.
నిజంగనే తెలంగాణ భాషను వింటే అచ్చ తెనుగుదనం చెవులకు ఇంపుగ తగులుతది. ప్రాచీన కవుల ప్రయోగాలు ఎన్నెన్నో తెలంగాణ ప్రజల వ్యవహారంల విన్పిస్తయి. ఆదివారం ‘గోలె’ ఎటువోతవు బిడ్డా!, ఊర్ల ‘పొన్న’ తిరుగవోకు, వాడు దేశాల’పొంటి’ వోయిండు వంటి వాక్యాలు ఇప్పటికీ పల్లెనోళ్ళల్ల నానుతున్నై. తెలంగాణ భాషకు ఒక నాద మాధుర్యం ఉన్నదని, అది పూర్ణానుస్వారం వలన సిద్ధిస్తున్నదనే ఎరుక కలిగించిండ్రు నలిమెల. ఇక్కడి జాతీయాలు, సామెతలు ఇతర ప్రాంతాలకంటె ఎట్ల వేరైనయో చేతిల దీపం బట్టుకొని చూపిండ్రు. యతి, ప్రాసలతోటి లయాత్మకంగ మారే పదాల వైనం చెప్పిండు. ద్విత్వంగ మార్చుడు, సంయుక్తాక్షరాలుగ చేసుడు ఇక్కడి ప్రజల భాషల ఎంత సాధారణమో చూపిస్తడు. ఇక్కడి ప్రజలు అర్థవంతమైన భాష మాట్లాడుతున్నరని, వ్యుత్పత్తులతోని నిరూపణ చేసిండు. ‘మేర, లాగు, తంతె, గుండీ, చల్ల, ఎర్ర, వాగు, గుల్ల, తొక్కు, కాపోళ్లు, బెస్తోళ్లు’ వంటి వందల పదాలను ఉడుంపట్టువట్టి వ్యాసాలు రాసి ‘బాణం’ పుస్తకంగ వేసిండ్రు నలిమెల.
నలిమెల ద్రవిడ భాషల లక్షణం తెలిసిన వారు కాబట్టి, తెలంగాణ భాషల ఉన్న పదాలకు ప్రాచీన ద్రవిడ భాషా మూలాలు తెలుసుకున్నరు. తెలంగాణ మాటలకు తమిళంతోటి ఉన్న సోపతిని, పొంతనను, చుట్టీర్కాన్ని విప్పి చెప్పిండ్రు. ఈ చెప్పుడు కూడా ఒక్క మాటల కాదు. తెలంగాణ భాష-తమిళ పదాలు పేరుతో పుస్తకమే వేసిండు. దీంట్ల కూడ ఒక పదం ఇచ్చి దాని ఎదురుంగ మరో పదం ఇచ్చి విడిచిపెట్టుడు కాదు, వాక్యం రాసుకుంట పోయిండు. ఇట్ల తెలంగాణ పదాలకు, మూల ద్రవిడ, తమిళ మూలాలున్న తుప్పల్‌, తూంగు, అచ్చు, తంబి, తెఱల్‌, తెన్‌, పూచ్చి, పుల్లాంగుళల్‌, కొండుపో, కల్లుప్పు, శుండెలి, వంటి వందల పదాలను పొక్కలకెల్లి సోదిచ్చుకచ్చిండు నలిమెల.
తెలంగాణ మాటకు మూల ద్రవిడ మూలాలే కాదు, ప్రాచీన కవులు నన్నయ, పాల్కురికి, తిక్కన, పోతన మొ. వాడిన దేశీ పదాల పొందిక కూడ ఉన్నది. ఈ ఉద్దేశ్యం బలపరుసుటానికి, రాసిందే తెలంగాణ భాష దేశ్యపదాలు. దీంట్ల శబ్ద రత్నాకరంల ఉన్న కోర, కొత్త, కయ్య, డొల్లు, తనబ్బీ, తబుకు, నెత్తి, నెనరు, దొంతి, నానువాలు, కంటు, ఈగి, కడమ, కర్రె మొదలైన దేశీ పదజాలమంత కుప్పవోసి వివరం చెప్తడు. తెల్లారితె పొద్దూకితే ఏ మాట మాట్లాడినా దాంట్ల సగం సంస్కృత పదాలె విన్పిస్తయి. సంస్కృత భాష దేశభాషల మీద చూయించిన ప్రభావం తక్కువనా! మరి, ఇది తెలంగాణ భాషల ఎట్ల ఇమిడిపోయింది? అది తెల్వాల్నంటె నలిమెల భాస్కర్‌ రాసిన తెలంగాణ భాష సంస్కృత పదాలు చదువాలె. యమళం అముడాల ఎట్లయింది, యాత్రను జాతరగ ఎట్ల మార్చుకున్నరు, బృహస్పతి వారానికి బేస్తవారపు రూపు ఎట్లా సిద్దించింది, గ్రహచారం గాశారంగ ఎట్లా రూపొందిందనే విషయాలను, ప్రజలకు వశీకృతమైన సంస్కృతం రీతిని చెలిమె సల్లినట్టుగ చెప్తరు భాస్కర్‌ సారు.
ఆడిబిడ్డను తోల్కచ్చుడు, పిల్లను తోల్కపోవుడు అనే మాటలు విని గుసగుసలు పెట్టినోళ్లకు జవాబులు కావాలె. ఏది చేసినా కాళ్ళల్ల కట్టెలు పెట్టెటోళ్లకు నిదానంగ చిలుకకు చెప్పినట్టు చెప్పాలె. తెలంగాణ క్రియ ఎన్నెన్ని పోకడలు పోయిందో చెవులిల్లుగట్టుకొని వినిపియ్యాలె. దీనికోసం తెలంగాణ భాష క్రియా పదాలు పుస్తకం తెచ్చి పదాల పండ్ల గంపను ముంగట పెట్టిండు నలిమెల. ఇట్ల, తెలంగాణ పద సంపదను పదకోశంగ వేసి, ప్రాచీన, ద్రావిడ, ప్రత్యేక లక్షణాల సంగతిని విప్పి చెప్పిండ్రు. వాక్య రీతి, నుడికారపు తీరు, పద సంపద విశిష్టతలను పొరలు పొరలుగ విప్పి తెలియజేసిండ్రు. ప్రజల భాష లక్ష్యంగ చేసుకొని లక్షణాలు కనిపెట్టి తెలంగాణ పలుకుకు గౌరవం కలిపించిండ్రు నలిమెల భాస్కర్‌ సారు.
ఎప్పుడైనా, భాష సమాజపు ఆస్తి. అవసరాన్ని బట్టి ఆ సంపదను పెంచే పదాలను ప్రజలు కల్పించుకుంటరు. వాళ్ళు విన్న దాన్ని, చూసిందాన్ని, అనుకున్నదాన్ని బట్టి వ్యవహారంల పదాలు తయారైతయి. గాలిలో తిరిగే మోటరు ‘గాలి మోటరు’ అని కొందరు అంటరు. పైన కనిపించేది కనుక ‘మీది మోటరు’ అని ఇంకొందరు అంటరు. ‘కుట్‌ కుట్‌’ మని చప్పుడు చేస్తే అది గుడు గుడు మోటరు అయింది. ప్రజల వాడుకల గుడు గుడు తారుమారై డుగ్గు డుగ్గు కూడ అయితది. ‘ప్రవాహినీ దేశ్యా’ అన్నది ఇందుకే. పలుకు ప్రవాహంలో ఎన్నెన్నో రూపాలను పొందుతది. గంగల రాళ్లు కరిగి నున్నగ అయినట్టు, మాటలు తీరు తీరు రూపాలల్ల ఉంటయి. ఇటువంటి రూపాలు తరతరాలుగ ప్రజల నోళ్ళల్ల నానీ నానీ నాజూకు అయితయి, ఎన్నడు విననోళ్లకు మోటుగ కూడ అనిపిస్తయి. మరి ప్రజల మాటకు విలువ ఉన్నదా! లేదా! అవి గాలిలకెల్లి ఊసిపడ్డయా! నోటినుంచే కద!
ఇటువంటి నుడికారపు తీరును, సహజత్వాన్ని, సరళత్వాన్ని కాపాడుకోవాలె. ఈ పని చేసే వాళ్ళే నిజమైన భాషావేత్తలు. ప్రజల నడుమ తిరిగి, సందర్భం చూసి, నేపథ్యం తెలిసి వాటిని వ్యాఖ్యానించుడే భాషా పండితులు చెయ్యాలె. ఇది అందరితోని అయ్యేది కాదు. ఏ శాస్త్రానికైన ముడి సరుకు అనుభవమో, ప్రయోగమో, ఫలితమో కావాలె. వాడుకను బట్టి సూత్రం తయారు కావాలె. సూత్రాన్ని చూపించి వాడుక సరిగ లేదనుడు మంచిది కాదు. వ్యాకరణ సూత్రాలు పట్టుకొని ఇది గ్రామ్యము, ఇది లక్షణ విరుద్ధము, ఇది వికృతము అనుడు ప్రజలను అవమానించుడే. ప్రజల భాష లక్ష్యంగా పనిచేసిన నలిమెల భాస్కర్‌ గారిని కాళోజీ అవార్డుతో సత్కరించుడు తెలంగాణ భాషకు పబ్బతివట్టినట్టు.
(కాళోజీ పురస్కారం అందుకుంటున్న సందర్భం)