క్యూబాలో మిలిటరీ బేస్‌ ఏర్పాటు

– ఒప్పందానికి చేరువలో చైనా, క్యూబా
క్యూబాలో మిలిటరీ ట్రైనింగ్‌ బేస్‌ నిర్మాణంకోసం బీజింగ్‌, క్యూబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని కొందరు మాజీ అమెరికా అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ మంగళవారం ఓ వార్తను ప్రచురించింది. క్యూబా ఉత్తర తీరంలో ఒక సైనిక కేంద్రాన్ని స్థాపించటం కోసం జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయనటానికి అమెరికా ఇంటిలిజెన్స్‌ సమాచారం ఆధారమని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ”ప్రోజక్ట్‌ 141” పేరుతో చైనీస్‌ మిలిటరీ ప్రపంచ వ్యాప్తంగా సైనిక స్థావరాలను ఏర్పరచుకునే ప్రయత్నంలో భాగమే ఈ మిలిటరీ బేస్‌ అని సదరు అమెరికన్‌ అధికారులు చెప్పినట్టు ఆ పత్రిక రాసింది. ఈ మిలిటరీ స్థావ రాన్ని సైనికులు శాశ్వతంగా నివాసముండటానికి, అమెరికాకు చెందిన ఇంటల్లిజెన్స్‌ సమాచారాన్ని గ్రహించటానికి ఉపయోగిస్తారని భావిస్తున్నారు. అమెరికా, చైనా సంబంధాల్లో ఏర్పడిన స్థబ్దతపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి, అథోనీ బ్లింకెన్‌ చైనాను సందర్శించిన తరువాత వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఈ కథనాన్ని ప్రచురించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శిని చైనా అధ్యక్షుడు క్షి జిన్పింగ్‌ స్వయంగా ఆహ్వానించి కలుసుకోవటం జరిగింది. క్యూబాలో చైనా ‘గూఢచార స్థావరం” ఉందని ఈ నెల మొదట్లో ఇదే పత్రిక రాయటం జరిగింది. ఈ రిపోర్ట్‌ ను దురుద్దేశపూర్వకంగా కల్పించిన కట్టుకథ అని క్యూబా ప్రకటించింది. ఇతర దేశాలలో ”నీడలను వేటాడంలో అమెరికా నిష్ణాతురాలు” అని చైనా పేర్కొంది. గత 60 ఏండ్లలో క్యూబాను దిగ్బంధించటమేకాక క్యూబాకు సమీపంలో గ్వాటనమో బేలో సొంత సైనిక స్థావరాన్ని అమెరికా ఏర్పరచు కున్న విషయాన్ని చైనా గుర్తుచేసింది.