– 3 నుంచి సెర్చ్ కమిటీల భేటీ
– వారంలో ఇంటర్ బోర్డుకు కొత్త కార్యదర్శి! : విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విశ్వవిద్యాలయల ఉపకులపతుల (వీసీ) నియామకం ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశమున్నదని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. ఈనెల మూడో తేదీ నుంచి సెర్చ్ కమిటీల సమావేశాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ కొన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సెర్చ్ కమిటీల సభ్యులు విదేశాల్లో ఉన్నారని వివరించారు. వారు వర్చువల్‌గా పాల్గొనే అవకాశముందన్నారు. మరికొన్ని వర్సిటీల సెర్చ్ కమిటీ సభ్యులు నేరుగా పాల్గొనేందుకు ఆలస్యమయ్యే అవకాశముందని అన్నారు. దీంతో వీసీల నియామకాల ప్రక్రియ దసరా తర్వాతే ఉండే అవకాశముందన్నారు. వీసీల నియామకాల్లో సామాజిక తరగతులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఇంటర్ బోర్డుకు కొత్త కార్యదర్శిని వారం, పది రోజుల్లోనే నియమిస్తామని వివరించారు. కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న శ్రీదేవసేన ఇంటర్ బోర్డు ఇన్‌చార్జీ కార్యదర్శిగా పనిచేస్తున్నారని అన్నారు. అయితే ఇంటర్ పరీక్షల నిర్వహణ ఎంతో కీలకమనీ, విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉందని అన్నారు. ఇన్‌చార్జీ బాధ్యతలు కాకుండా రెగ్యులర్ పద్ధతిలోనే ఇంటర్ బోర్డుకు కార్యదర్శిని నియమిస్తామని చెప్పారు. విద్యాకమిషన్ సభ్యులపై కసరత్తు జరుగుతోందనీ, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.