మోడీ గురించి వినలేదు

– కుండబద్దలు కొట్టిన 40% అమెరికన్లు
– ఆయనపై విశ్వాసం లేదన్న 37% మంది
వాషింగ్టన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు మీడియాలో విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నా.. మోడీ గురించి తాము ఎప్పుడూ వినలేదని అమెరికా ప్రజలు గణనీయమైన సంఖ్యలో తెగేసి చెప్పారు. వాషింగ్టన్‌ డీసీకి చెందిన ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలోని 40% ప్రజలు తాము మోడీ గురించి ఎప్పుడూ వినలేదని స్పష్టం చేశారు. 35% మంది తమకు జర్మనీ ఛాన్సలర్‌ ఒలఫ్‌ హోల్జ్‌ గురించి తెలియదని, 26% మంది ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తెలియదని, 24% మంది ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ తెలియదని తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెస్కీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గురించి మాత్రం అమెరికా ప్రజలకు బాగానే తెలుసు. సర్వే నివేదికను బుధవారం విడుదల చేశారు. మార్చి 20-26 తేదీల మధ్య 3,576 మంది అమెరికా పౌరులను సర్వే చేసి నివేదికను రూపొందించారు. సర్వే నివేదిక ప్రకారం… 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అమెరికా యువతలో 59% మందికి మోడీ గురించి ఏ మాత్రం తెలియదు. మోడీ గురించి తెలిసిన వారు సైతం ఆయనపై నమ్మకం లేదని స్పష్టం చేయడం గమనార్హం. అంతర్జాతీయ వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ సామర్ధ్యంపై తమకు కొద్దిగా మాత్రమే నమ్మకం ఉందని లేదా అసలు లేదని 37% మంది తెలిపారు. 21% మంది మాత్రం తమకు ఈ విషయంలో ఆయనపై నమ్మకం ఉందని చెప్పారు. రెండు శాతం మంది మాత్రం తమకు తెలియదని చెప్పడమో లేదా సమాధానమిచ్చేందుకు నిరాకరించడమో జరిగింది. అమెరికన్లలో 65 సంవత్సరాల పైబడిన వారిలో చాలా మంది తమకు మోడీ గురించి తెలుసునని అన్నారు. వీరిలో 28% మంది మాత్రం తమకు ఆయన గురించి తెలియదని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే మోడీ గురించి తమకు తెలియదని చెప్పిన అమెరికా పౌరులలో 51% మంది మాత్రం మన దేశం విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న అమెరికన్లలో 64% మంది అంతర్జాతీయంగా భారత్‌ ప్రభావంలో ఎలాంటి మార్పూ రాలేదని తెలిపారు. 23% మంది భారత్‌ ప్రభావం పెరిగిందని చెప్పగా 11% మంది తగ్గిందని అన్నారు. భారత్‌ ప్రభావం పెరుగుతోందని చెప్పిన వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు.