బ్యాడ్మింటన్‌కు మంచి ఆదరణ

హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు ఒలింపిక్స్‌, ఆసియా క్రీడలు, కామెన్‌వెల్త్‌ సహా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాధించిన విజయాలు అమోఘమని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ‘ యువతలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ తారా స్థాయిలో ఉంది. ఎక్కువ మంది బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్మింటన్‌ అభివృద్దికి గొప్ప సహకారం అందిస్తుందని’ గోపీచంద్‌ అన్నారు. కన్హా బ్యాడ్మింటన్‌ అకాడమీ వేదికగా తెలంగాణ రాష్ట్ర 9వ సీనియర్‌ బ్యాడ్మిం టన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ప్రారంభించిన గోపీచంద్‌.. ఈ సందర్భంగా వర్థమాన షట్లర్లతో ముచ్చటించారు. రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం, యోనెక్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోటీల ఆరంభోత్సవంలో ఏపీ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, మాజీ షట్లర్‌ పుల్లెల లక్ష్మి, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు పాల్గొన్నారు.