సంప్ర‌దాయ వంట‌లు

Traditional dishesప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృ‌తి సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. అలాంటి సాంప్రదాయ వంటలకు సంబంధించి కొన్ని నేటి మానవిలో…
మలీద లడ్డూలు
కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – అరకప్పు, పాలు – అర కప్పు, నట్స్‌ – గుప్పెడు (జీడిపప్పు, బాదం, పిస్తా), ఉప్పు – రుచికి సరిపడా, బెల్లం తురుము- ఒక కప్పు, సోంపు పొడి – అర టీస్పూను, యాలకుల పొడి – ఒక టీస్పూను
తయారీ విధానం: 1. గోధుమ పిండిని, రవ్వను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. అందులో కాచిన నెయ్యిని పోసి బాగా కలపాలి. ఆ తరువాత పాలు వేసి బాగా కలిపి, చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఓ పావుగంట తరువాత మీడియం సైజుల్లో ఉండగా చుట్టుకుని చపాతీల్లా ఒత్తుకుని కాల్చాలి. ఓ కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తాలు సన్నగా తరిగి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చపాతీను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీలైతే ఓసారి మిక్సీలో కచ్చపచ్చాగా రుబ్బుకోవాలి. నీళ్లు చేరనివ్వకూడదు. ఒక గిన్నెలో చపాతీ పొడిని వేసి, అందులో బెల్లంగా తరుగును వేయాలి. అందులో కాచిన నెయ్యిని, ముందుగా వేయించుకున్న నట్స్‌ తరుగును, యాలకుల పొడి కూడా అందులో కలపాలి. అన్నింటినీ బాగా కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే మలీద లడ్డూ తయారైనట్టే.
మక్క సత్తు ముద్దలు
తయారు విధానం: ముందుగా మొక్కజొన్న గింజలు వేయించి.. చల్లారాక పొడి చేసుకోవాలి. అదే విధంగా బెల్లం తరుము లేదంటే పంచదారను పొడి చేసి పెట్టుకోవాలి. ఈ రెండింటి మిశ్రమంలో నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకుంటే మక్క సత్తు ముద్దలు రెడీ.
అట్ల బతుకమ్మ…
తయారీ విధానం: ఒక గిన్నెలో కప్పు బియ్యంపిండి, పావు కప్పు రవ్వ, పావు కప్పు పెరుగు, జీలకర్ర, తగినంత నీళ్లు వేసి బాగా కలపాలి. దోశె పిండిలా కలుపుకోవాలి. పది నిమిషాలు పక్కన పెట్టాక ఆ పిండితో దోశెలు వేసుకోవాలి.
గోధుమ తేనె హల్వా
కావలసిన పదార్థాలు: నెయ్యి 4 స్పూన్లు, గోధుమపిండి ఒక కప్పు, తేనె – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, తరిగిన బాదాం, పిస్తా ముక్కలు, యాలకుల పొడి – కొద్దిగా.
తయారీ విధానం: కడాయి పెట్టుకుని వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక గోధుమపిండి వేసుకోవాలి. కాస్త రంగు మారి సువాసన వచ్చేవరకు దాన్ని వేయించాలి.
బాగా వేగాక తేనె కూడా పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక కప్పు నీళ్లు కూడా పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
చివరగా తరిగిపెట్టుకున్న పిస్తా, బాదాం వేసుకుని కలపుకోవాలి. అంతే కాస్త చిక్కబడ్డాక దింపేసుకుంటే చాలు.
నువ్వుల సద్ది
కావాల్సిన పదార్థాలు: అన్నం – నాలుగు కప్పులు, నువ్వులు – ఒక కప్పు, మెంతులు – ఒక స్పూను, ధని యాలు – రెండు స్పూన్లు, మిరపకాయలు – 5, వంటనూనె – నాలుగు స్పూన్లు, ఆవాలు – ఒక స్పూను, జీలకర్ర- ఒక స్పూను, శెనగలు – 4 స్పూన్లు, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – ఒక స్పూను.
తయారీ విధానం: నువ్వులు, మెంతి గింజలు, ధనియాలను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ స్టవ్‌ పై పెట్టుకుని .. అందులో ఒక టీస్పూన్‌ నూనె పోసి అందులో ఎండు మిరపకాయను చిన్న ముక్కలుగా చేసి వేయించి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్‌ పై పాన్‌ పెట్టి.. వేడెక్కిన తర్వాత నూనె పోసి.. జీలకర్ర, ఆవాలు, శెనగలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, వేసి కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి ప్లేట్‌ తీసుకుని వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వచ్చేంత వరకు ఉంచి.. అందులో నువ్వుల గింజల మసాలా మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలపండి. అంతే.. రుచికరమైన నువ్వుల సద్దీ తయారైనట్టే. దీన్ని పెరుగు లేదా ఫ్రై లతో సర్వ్‌ చేసుకోవడమే.