– ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేని నాణ్యమైన చేప పిల్లల పంపిణీయే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ వెల్లడించారు. తద్వారా మత్స్యకారుల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 80శాతం చేపపిల్లల కాంట్రాక్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి ఇచ్చారనీ, 20 శాతం కాంట్రాక్టులు తెలంగాణ రాష్ట్రానికి అప్పగించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 80శాతం తెలంగాణ కాంట్రాక్టులకు అప్పగించిందని గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత పదేండ్లలో చేప పిల్లల పంపిణీలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. చెరువుల రకాలను బట్టి మూడు రకాల చేపలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తామని తెలిపారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో గురువారం కరీంనగర్‌లో చేపపిల్లల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.