– బీఆర్‌ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్.ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోన్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినరుభాస్కర్‌పై దాడి, కేటీఆర్ కాన్వారు అడ్డగింత ఘటనలు కాంగ్రెస్ రౌడీ పాలనకు అద్దం పడుతోన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నేతలు, ఇండ్లపై జరుగుతున్న దాడులన్నీ ముఖ్యమంత్రి కనుసన్నలలో జరిగాయని ఆరోపించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నా, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. గుండా రాజ్యం ఎంతో కాలం నడవదనీ, ప్రజలు తిప్పికొట్టే రోజులు వస్తాయని వారు హెచ్చరించారు.