– ఎస్‌బీఐ చైర్మెన్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 600 శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మెన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. అభివృద్థి చెందుతున్న ప్రాంతాలు, పెద్ద నివాస టౌన్‌షిప్పుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్‌బీఐకి 22,542 శాఖలు, 65వేల ఏటీఎం కేంద్రాలు, 85వేల బిజినెస్ కరస్పాండెంట్టు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 137 శాఖలను తెరిచింది. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాఖలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 50 కోట్ల మంది వినియోగదారులకు సేవలందిస్తున్నామని శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ప్రతి భారతీయుడికి, కుటుంబానికి చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. వాటాదారుల దృష్టిలోనే కాకుండా ఎస్‌బీఐతో అనుబంధం కలిగిన వారందరిలోనూ అత్యంత విలువైన బ్యాంక్‌గా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నామన్నారు. డిపాజిట్ల సేకరణకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. డిపాజిట్లను ఆకర్షించేందుకు రికరింగ్ డిపాజిట్, సిప్ కాంబోలో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్టు వెల్లడించారు. తమకున్న విస్తృతమైన నెట్‌వర్క్‌తో పెద్ద ఎత్తున డిపాజిట్లను సేకరించనున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరగడంతో పాటుగా వినియోగదారులు సైతం ఆర్థిక అంశాలపై అవగాహన పెరిగిందన్నారు.