నాటుడెందుకు.. నరుకుడెందుకు.?

నాటుడెందుకు.. నరుకుడెందుకు.?– విద్యుత్ తీగలకు అడ్డం వస్తున్నాయని చెట్ల నరికివేత
నవ తెలంగాణ – మల్హర్ రావు:
ఒకవైపు వన మహోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కొనసాగిస్తూ ఉంటే మరో పక్క పదేళ్ల కింద నాటిన మొక్కలు పెరిగి పెద్దవి అయ్యాక విద్యుత్ తీగెలకు ఆటంకం అని నరికివేసిన విచిత్ర పరిస్థితి మండలంలో చోటు చేసుకుంది.మండల కేంద్రమైన తాడిచెర్ల, చిన్నతూoడ్ల,రుద్రారం,మల్లారం,కొయ్యుర్ ప్రధాన రహదారిలో హరితహారం మొదటి విడతలో భారీ సంఖ్యలో మొక్కలను నాటారు. వాటిని అప్పటి ప్రభుత్వం నేతృత్వంలో మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. నీడను ఇస్తూ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న చెట్లు విద్యుత్ లైన్కు అడ్డంగా వస్తున్నాయనే కారణంతో విద్యుత్ సిబ్బంది నరికివేయించారు.నరికేసిన చెట్ల దుంగలుగా విక్రయించిన పరిస్థితి.చెట్లను గ్రామ పంచాయతీ ఉద్యోగులు కాపాడుతూ ఉంటే విద్యుత్ ఉద్యోగులు లైన్కు ఆటంకం అని నరికివేయించడంతో నీడ కరువైంది. రోడ్లకు ఇరువై పులా మొక్కలు నాటే సమయంలోనే విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయం చేసుకుని ఉంటే ఇలా చెట్లను నరికివేసే పరిస్థితి ఏర్పడదని పలువురు సూచిస్తున్నారు. విద్యుత్ లైన్ వేసే మార్గాన్ని అధికారులు ముందుగానే గుర్తించి ఆ లైన్కు దూరంగా మొక్కలను నాటించే చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు విన్నవిస్తున్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మొక్కలను సంరక్షించుకోవడమే తప్ప నరికివేయడం సరైన పద్దతి కాదనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని వనమహోత్సవంలో నాటే మొక్కల సంరక్షణపై దృష్టి సారిం చాలని పలువురు కోరుతున్నారు.