– బెంగళూరు మార్కెట్లోకి పౌలోమి ఎస్టేట్స్
– రూ.800 కోట్లతో హైరైజ్ నివాస ప్రాజెక్టు
– డైరెక్టర్ ప్రశాంత్ రావు వెల్లడి
నవ తెలంగాణ – హైదరాబాద్
ప్రీమియం రియాల్టీ కంపెనీ పౌలోమి ఎస్టేట్స్ బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. అక్కడ రూ.800 కోట్లతో 35 అంతస్తుల్లో 850 నివాసాలను అందుబాటులోకి తేనున్నామని పౌలోమి ఎస్టేట్స్ డైరెక్టర్ ప్రశాంత్ రావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో ఆ సంస్థ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ ఎం మారుతి రావుతో కలిసి ప్రశాంత్ రావు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో తాము ఎనిమిది ప్రాజెక్టులను చేపట్టామని.. ప్రస్తుతం కోకాపేటలో రెండింటి నిర్మాణం కొనసాగుతుందన్నారు. తాజాగా ఉత్తర బెంగళూరులోని తనిసంద్రలో 18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రెండు దశల్లో దీన్ని పూర్తి చేయనున్నామన్నారు. ఫ్లాట్ కనీస ధరను రూ.1.4 కోట్లుగా ఉండొచ్చన్నారు. 1450-2550 చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాసాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు డోకా లేదన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు సాధారణంగానే రియాల్టీ కొనుగోళ్ల పట్ల వినియోగదారులు వేచి చూసే దోరణీతో వ్యవహారిస్తారన్నారు. దీంతో గడిచిన ఆరు నెలలుగా కొంత తగ్గినట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. మళ్లీ పుంజుకోనుందన్నారు. మౌలిక వసతుల కల్పన పెంచడం ద్వారా కాలక్రమేణ రియాల్టీకి మరింత డిమాండ్ పెంచొచ్చన్నారు. గత నాలుగైదు ఏళ్లుగా నిర్మాణ వ్యయం 35 శాతం మేర పెరిగిందన్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన భూముల ధరల వల్ల నివాసాల ధరలు పెరిగాయన్నారు. హైదరాబాద్‌లో తమ సంస్థ 22.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు నివాస ప్రాజెక్టులు, 10 లక్షల చదరపు అడుగుల్లో రెండు వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టామన్నారు. కోకాపేటలో చేపడుతున్న ఇన్‌ఫినిట్ ప్రాజెక్టు వచ్చే ఏడాది జులై కల్లా పూర్తి కానుందన్నారు. ఇందులో ఇప్పటికే 75 శాతం విక్రయాలు పూర్తి అయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌లోని విజయాలను బెంగళూరు లో పునరావృతం చేయగలమని ప్రశాంత్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.