శాంతిభద్రతల్లో సీఎం ఫెయిల్‌: మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో శాంతిభద్రతల నియంత్రణలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. హోంశాఖను కూడా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నారనీ, ఆయన హయాంలో 9 నెలల్లో మహిళలపై రెండువేల అత్యాచారాలు జరిగాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప, మహిళలకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. తాజాగా ఇద్దరు మైనర్‌ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా భద్రతపై సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని హెచ్చరిం చినా, నిర్లక్ష్యం వీడలేదన్నారు. గత ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందనీ, షీ టీమ్స్‌, సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. మైనర్‌ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.