– ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు
– చీరల పంపిణీపై రాని స్పష్టత
– ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న మహిళలు
నవ తెలంగాణ మల్హర్ రావు.
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కానుకలు ఈసారి లేనట్లుగానే కనిపిస్తోంది. బతుకమ్మ చీరల పంపిణీని రద్దు చేస్తున్నామని. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు మాత్రమే ఏడాదికి రెండు చీరలను ఉచితంగా అందజేస్తామని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ దానిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఓ దశలో చీరలకు బదులుగా ఆడపడచులకు ఒక్కొక్కరికి రూ.500 నగదును వారి ఖాతాల్లో జమచేసేలా ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ దీనిపైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు బతుకమ్మ వేడుకలు మండలంలో ప్రారంభమయ్యాయి.ఆడపడచులు తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో సందడి చేస్తున్నారు. అయితే ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఏం ఇస్తుందా? అనే దానిపై మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా దృష్టి సారించకపోవడంతో ఈ యేడు కానుకలు లేనట్లుగానే తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో చీరల పంపిణీ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కొన్నేళ్ల పాటు ఆడపడుచులకు చీరలను కానుకగా అందించింది. బతుకమ్మ వేడుకల ప్రారంభానికి ముందుగానే మండలానికి అవసరమైన చీరలను పంపించేది. వాటిని డీఆర్డీఏ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఎంతో ఆర్భాటంగా పంపిణీ చేసేవారు. రేషన్ కార్డు కలిగి ఉండి, 18 ఏళ్ల వయస్సు నిండిన యువతులు, మహిళలందరికీ ఈ చీరలను అందించేవారు.గతేడాది మండలంలో 15 గ్రామాలకు గానూ 8,906 చీరలను ప్రభుత్వం పంపిణీ చేసింది.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన చీరల నాణ్యతపైన అప్పట్లో పలువురు మహిళలు అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల చీరలను దగ్ధం చేసిన మహిళలు అప్పటి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలను సైతం చేపట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సైతం చీరల నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యం లోనే వాటి పంపిణీని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది.
ఎస్ హెచ్ జి మహిళలకు మాత్రమే…
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరల పంపిని కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.స్వయం సయక సంఘాల్లోని సభ్యులకు మాత్రమే ఏ డాదికి రెండు చీరలను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. దీంతో లబ్దిదారుల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశముంది. అయితే ప్రభుత్వం ఇచ్చినా అవి కూడా ప్రస్తుత బతుకమ్మ పండుగకు అందేలా కన్పించడం లేదు. బతుకమ్మ వేడుకలు మండలంలో ప్రారంభమయ్యాయి. దసరా పండగ సైతం మరో 8 రోజుల్లోనే ఉంది. ఇప్పటికిప్పుడు చీరలను జిల్లాకు పంపించినా జిల్లా నుంచి మండలాలకు అక్కడి నుంచి గ్రామాలకు పంపిణీ చేయడం అసాధ్యంగానే మారనుంది. కాగా చీరలకు బదులుగా రూ.500 నగదును మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జను చేస్తుందనే చర్చ సైతం జోరుగా సాగింది. దీనిపై మహిళల్లో హర్షం వ్యక్తమైంది. ప్రభుత్వం చీరలకు బదులుగా నగదు జమచేస్తుందనే ప్రచారం వారిలో ఆనందం నింపింది. అయితే దీనిపై ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అది ప్రచారం గానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ కానుకలను అందిస్తుందా? లేక వాటిని రద్దు చేస్తుందా? అనేదానిపై ప్రస్తుతం మహిళావర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.ప్రభుత్వం నిర్ణయంపై వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అధికారికవర్గాల్లో మాత్రం ఈ యేడు బతుకమ్మ కానుకలు ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.