నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నల్లగొండ బీఆర్‌ఎస్ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు లేవంటూ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన కూల్చివేత నోటీసుల విషయంలో స్టేటస్‌కో (యథాతథస్థితి ఉత్తర్వుల)ను హైకోర్టు జారీ చేసింది. నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ చేసేందుకు కార్పొరేషన్ తిరస్కరించింది. కూల్చివేత నోటీసులను రెండుసార్లు బీఆర్‌ఎస్ నేత రమావత్ రవీందర్ సవాల్ చేయడంతో ఆగ్రహించిన సింగిల్ జడ్జి వాటిని కొట్టివేయడమే కాకుండా లక్ష రూపాయల జరిమానా విధించారు. వీటిని సవాలు చేస్తూ రవీందర్ అప్పీల్ పిటిషన్ వేయగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే బెంచ్ శుక్రవారం విచారించింది. ఇదే తరహాలో మరో అప్పీల్ పిటిషన్ ఈ నెల 21న విచారణ జరగనుందనీ, ఈ అప్పీల్‌ను కూడా అప్పుడే విచారిస్తామంది. అప్పటి వరకు బీఆర్‌ఎస్ బిల్డింగ్ వ్యవహారంపై స్టేటస్‌కో ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది.