– ప్రజాభవన్ వద్ద జేఎల్ అభ్యర్థుల శాంతియుత నిరసన
– ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు తుది ఫలితాలు త్వరగా విడుదల చేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మహాత్మా జోతిబాఫూలే ప్రజాభవన్ వద్ద వందలాది మంది అభ్యర్థులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 56 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను ప్రకటించి 65 రోజుల్లోనే నియామకపత్రాలను ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవ్వడం సంతోషకరమని పలువురు అభ్యర్థులు అన్నారు. అయితే 2022లో టీజీపీఎస్సీ 1,392 జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందనీ, అప్పటి నుంచి నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇస్తున్నట్టుగానే జేఎల్ అభ్యర్థులకు కూడా 1:1 నిష్పత్తిలో ఎంపిక చేసి నియామకపత్రాలను అందించాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని ముఖ్యంగా ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. చిన్నారెడ్డి సానుకూలంగా స్పందించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సంప్రదిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండరామ్‌ను అభ్యర్థులు కలిశారు. టీజీపీఎస్సీ కార్యదర్శితో మాట్లాడి ఫలితాలు త్వరగా వచ్చేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఎల్ అభ్యర్థులు లింగనాయక్, వేణురావు, సతీష్, పాషా, నాగరాజు, అశ్విన్, ప్రవళిక, లావణ్య, చిత్రీక, శ్రీలక్ష్మి, హరిత తదితరులు పాల్గొన్నారు.