ఫెర్రీ బోల్తా పడి 87మంది మృతి

గోమా : కాంగోలోని కివూ చెరువులో ఫెర్రీ మునిగి గురువారం 87మంది చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని మినొవా పట్టణం నుండి వస్తున్న ఈ ఫెర్రీ ఉత్తర కివూ రాజధాని గోమా శివార్లలో కిటుకు ఓడరేవుకు సమీపంలో బోల్తా పడింది. మరో 78మంది ఆచూకీ తెలియకుండా పోయారని రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసింది. వెలికితీసిన 87 భౌతిక కాయాలను గోమాలోని ఆస్పత్రికి తరలించారు. బతికి బయటపడిన మరో 9మందిని కూడా ఆస్పత్రిలో చేర్చారు. మొత్తంగా బోటులో ఎంతమంది వున్నారన్నది తెలియరాలేదు. కానీ బోటు ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తోందని స్థానిక వర్గాలు తెలిపాయి. ఓడరేవుకు 700మీటర్ల దూరంలో వుండగా, ఒక్కసారిగా వచ్చిన నీటి కుదుపునకు బోటు తట్టుకోలేకపోయి తిరగబడిందని కిటుకు పోర్ట్‌ సిబ్బంది చెప్పారు. సాయుధ గ్రూపులు, మిలటరీ మధ్య ఘర్షణల కారణంగా నెలల తరబడి గోమా, మినోవా మధ్య రోడ్డు సంబంధాలు దెబ్బతినడంతో బోట్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిపోయింది. బలమైన గాలులు, ఓవర్‌లోడింగ్‌ కారణంగా బోటు ప్రమాదాలు కూడా తరచుగా చోటు చేసుకుంటున్నాయి.