బొడ్డెమ్మ పండుగ ప్రకతి పండుగ. ఇటు మట్టితోను అటు పూలతోను జరిగే పండుగ. బొడ్డెమ్మను తయారు చేయడంలోనూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానం ఉంటుంది. బతుకమ్మ పండుగకు ముందు బొడ్డెమ్మ పండుగ వస్తుంది. భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు బహుళ పంచమి నుంచి తొమ్మిది రోజులు ఈ పండుగను నిర్వహిస్తారు. మరికొందరు ఐదు రోజులు, మూడు రోజులు దశమి, ద్వాదశి నుంచి కూడా చేస్తారు. ఈ పండుగ ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఈ పండుగను బొడ్డెమ్మ పున్నమి అంటారు. బాలికలు, పెళ్ళికాని అమ్మాయిలు మాత్రమే బొడ్డెమ్మ ఆడుతారు.
బొడ్డెమ్మను తయారు చేయడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. చతురస్రాకారంలో ఉన్న చెక్క పీటను తీసుకొని, అడవి నుండి ఎవరి కాలి అడుగుపడని పుట్ట మట్టిని తెచ్చి, మెత్తగా ముద్దచేసి పీట మీద గుండ్రంగా ఒకదానిపై ఒకటి ఐదు వరసలు వచ్చేలా చేసి, పైన గోపురం ఆకారం పెడతారు. ఆపైన ఒక చిన్న మట్టి పాత్ర పెట్టి, అందులో పసుపు గౌరమ్మను పెట్టి, దీపం ముట్టిస్తారు. బొడ్డెమ్మను ఆడే ప్రదేశం పేడ నీళ్లతో అలికి ముగ్గు వేసి అందులో పెడతారు. సాయంకాలం పూట బొడ్డెమ్మ పాటలు పాడుతూ ఆడతారు
”బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్/ బిడ్డలెందారే కోల్/ నా బిడ్డలేడుగురు కోల్/ నీళ్లలో పడ్డారు కోల్/ చెరువుల పడ్డారు కోల్/ చేరిద్దారమ్మ కోల్/ వాగులో పడ్డారు కోల్/ వారిద్దరమ్మా కోల్/ నూతిలో పడ్డారు కోల్/ నూరిద్దరమ్మా కోల్/ నాతోటి గౌరమ్మ కోల్/ నిలుకడగా ఉండమ్మా కోల్/ పసుపు కుంకుమతోను కోల్/ నిన్నెత్తుదునమ్మా కోల్/ పట్టుచీరతోను కోల్/ నిన్నంపుదునమ్మా కోల్/ పోయిరా బొడ్డెమ్మ కోల్/ పోయి రావమ్మా కోల్/ ఏటేట మా ఇంటికి కోల్/ వచ్చి పోవమ్మా కోల్” అని పాటలు పాడి బొడ్డెమ్మను సాగనంపుతారు.
తమ తమ ఆరాధ్య దైవాలను పువ్వులతో పూజించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆచారం అయితే పూలనే పూజించే విలక్షణ సంస్కతి తెలంగాణది. ప్రకతిని అమ్మగా, ఆదిశక్తిగా ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. తెలంగాణ మహిళలకు, పిల్లలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ ఇది. దైనందిన జీవితంలో తీరికలేని పనులతో సంవత్సరమంతా సతమతమయ్యే మహిళలకు ఈ పండుగ రోజుల్లో తమ పుట్టింటికి వెళ్లడం, అక్కచెల్లెళ్లతో, చిన్ననాటి స్నేహితురాళ్లతో గడపడం, అలసిపోయే వరకు బతుకమ్మ ఆడుతూ ఆనందంగా పాటలు పాడడం గొప్ప అనుభూతి. బతుకమ్మ పండుగలో ప్రధానంగా కనిపించేవి పూలు, పాటలు, పడతులు, ప్రకతి. ఎవరు పెంచకుండానే సహజాతి సహజంగా మన చుట్టూ పెరిగే తీరొక్క పూలను ఏరుకొచ్చి వాటిని అందంగా పేర్చి పూజించడం, వాటి చుట్టూ లయబద్ధంగా అడుగులు వేస్తూ ఉయ్యాల పాటలను రాగయుక్తంగా పాడడంతో పాటు ఈ పండుగలో ప్రతిదీ స్త్రీల సజనాత్మకతతో, ప్రకతి ఆరాధనతో ముడిపడినదే.
తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. సెప్టెంబర్/ అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వీయుజ శుద్ద పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ.
గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, ఎర్రగన్నేరు, పచ్చ గన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి రకరకాల పూలను సేకరించి రంగులు రంగులుగా పేర్చి పైన పసుపు ముద్దని నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకొని చెరువులోనో, బావిలోనో నిమజ్జనం చేస్తారు.
తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. తొమ్మిది రకాల ఫలహారాలను సమర్పిస్తారు. మొదటిరోజు మహాలయ అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత బతుకమ్మను పేరుస్తారు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు నువ్వులు బెల్లం చక్కెరను ఫలహారంగా పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఈరోజు పప్పు, బెల్లం, అటుకులు ప్రసాదం చేస్తారు. మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మ గా పిలుస్తారు. ఈరోజు ముద్దపప్పు బెల్లం ప్రసాదంగా చేస్తారు. నాలుగవ రోజు నాను బియ్యం, ఐదవరోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలకల బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా ఆడుతారు.
దసరా పండుగకు ఒకటి రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆరోజు బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆడబిడ్డలను, బంధువులను పిలుచుకుంటారు. బతుకమ్మను ఎత్తుకొని సద్దులు తీసుకొని ఆడుకున్న తర్వాత చెరువుకు వెళ్తారు. జొన్నపిండి, మక్కపిండి, బెల్లం, పెసర పిండి, నెయ్యితో చేసిన మలీద, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లం తో సద్దులను తయారు చేస్తారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి మరోసారి ఆడుకొని చెరువులో వేసి సాగనంపి తెచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మను నీళ్లలో వదలడం కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. మోకాలి లోతు నీటి వరకు వెళ్లి, నీటిపై బతుకమ్మను ఉంచి ఏమాత్రం చెదరకుండా ఒడుపుగా వదిలి తాంబాళాన్ని పక్కకు తప్పిస్తారు. తర్వాత నీటిని మూడుసార్లు ముందుకు నెట్టి దండం పెట్టి వెనుకకు తిరుగుతారు.
బతుకమ్మ ఆటలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఒక పద్ధతి ప్రకారం అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ వంగి లేస్తూ లయబద్ధంగా ఆడుతారు. ఆట,పాట, నాట్యం ఈ మూడింటితో పాటు పాటల్లో గొప్ప సాహిత్యం ఉంటుంది. బతుకమ్మ పాటల బాణీలు ఎంతో ప్రసిద్ధిగాంచినవి. ఆయా ప్రాంతాల ఆచారాలు, పేర్లు అలవాట్లను భాషను కలబోసుకొని ప్రాంతీయ కథలతో పాటలు పాడుతారు. అత్తవారింట్లో ఉన్న అమ్మాయి ఈ పండుగ వచ్చిందంటే చాలు, పుట్టింటి వారి కోసం ఎదురుచూస్తుంది. ఎదురుచూపులు కూడా పాటల రూపంలోనే చెబుతుంది. వీటిలో ఆడపిల్లల జీవితాల్లోని కష్టాలు, వారి అత్తవారింట్లో ఎదుర్కొనే సమస్యల గురించిన పాటలే ఎక్కువగా ఉంటాయి.
బతుకమ్మ పండుగకు జీవం బతుకమ్మ పాటలు. ఈ పాటల్లో కేవలం ఆధ్యాత్మిక, ఇతిహాస ఇతివత్తాలే కాకుండా చారిత్రక, జానపద, సామాజిక, మానవ సంబంధాలు కూడా కనిపిస్తాయి. పండుగకు తీసుకెళ్లడానికి వచ్చే అన్న కోసం ఎదురు చూడటం నుండి సీతమ్మ అలక వరకు ప్రతిదీ ఈ పాటల్లో ఇమిడి ఉంటుంది.
”రామ రామ ఉయ్యాలో/ రామననే శ్రీ రామ ఉయ్యాలో/ రామ రామనంది ఉయ్యాలో/ రాగమెత్తరాదు ఉయ్యాలో/ నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో/ నెల వన్నెకాడ ఉయ్యాలో/ పాపట్ల చంద్రుడా ఉయ్యాలో/ బాల కుమారుడా ఉయ్యాలో/ పెద్దలకు వచ్చింది ఉయ్యాలో/ పెత్తరామాస ఉయ్యాలో/ బాలలకు వచ్చింది ఉయ్యాలో/ బతుకమ్మ పండుగ ఉయ్యాలో” అంటూ మొదటగా దైవాన్ని తలుచుకుంటారు.
ఆడబిడ్డలు ఎదురుచూపులతో పాడే పాట ”ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో/ ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో/ ఒక్కడే మాయన్న ఉయ్యాలో/ వచ్చన్నవోడు ఉయ్యాలో/ వచ్చన్నవోడు ఉయ్యాలో/ చూసన్నవోడు ఉయ్యాలో/ ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో/ ఏరడ్డమాయే ఉయ్యాలో” అంటూ అన్న కోసం ఎదురుచూసే బాధాతప్త హదయంతో పాడే పాట ఎంతో హద్యంగా ఉంటుంది.
”కలవారి కోడలు ఉయ్యాలో/ కలికి కామాక్షి ఉయ్యాలో/ వంటింట్లో కూసుండి ఉయ్యాలో/ బియ్యమేరుతుంటే ఉయ్యాలో/ అప్పుడే కామాక్షి ఉయ్యాలో/ అన్న వచ్చినాడు ఉయ్యాలో/ కాళ్లకు నీళ్లు ఇచ్చి ఉయ్యాలో/ కన్నీళ్లు తీసింది ఉయ్యాలో/ ఎందుకు చెల్లెలా ఉయ్యాలో/ ఏడవకమ్మా నీవు ఉయ్యాలో/ కట్టుకో బట్టలు ఉయ్యాలో/ పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో/ మల్లె తోటలో ఉన్న ఉయ్యాలో/ ఓ మామగారు ఉయ్యాలో/ మా అన్న వచ్చిండు ఉయ్యాలో/ మమ్మంపరాద ఉయ్యాలో/ నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో/ మీ అత్తనడుగు ఉయ్యాలో/ పత్తి తోటలో ఉన్న ఉయ్యాలో/ ఓ అత్తగారు ఉయ్యాలో” ఇంట్లో అందరినీ అనుమతి కోరి తల్లిగారింటికి వెళతానని బ్రతిమాలుకునే సందర్భాన్ని కూడా పాటగా మలచడం అత్యద్భుతం.
”శ్రీ లక్ష్మీ నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా/ భారతి సతివయ్యి/ బ్రహ్మ కిల్లాలివై పరమేశురాణివై/ పరగ శ్రీ లక్ష్మీయ్యూ గౌరమ్మ భార్య వైతివి హరికినీ” అంటూ గౌరమ్మను పరిపరివిధాలుగా కొలుస్తారు.
”వరమును పుట్టింది ఉయ్యాలో/ వరలక్ష్మీదేవి ఉయ్యాలో/ వరలక్ష్మి దేవికి ఉయ్యాలో/ తెల్లాట తండ్రాట ఉయ్యాలో/ ఆ తల్లిదండ్రులకు ఉయ్యాలో/ ఏడుగురు దాసీలు ఉయ్యాలో/ ఏడుగురు దాసీలను ఉయ్యాలో/ వెంటేసుకొని ఉయ్యాలో/ పాయనే వరలక్ష్మి ఉయ్యాలో/ పూల జాడలకు ఉయ్యాలో/ గుండ్రంగా పూసినవి ఉయ్యాలో/ గుమ్మడి పూలు ఉయ్యాలో/ కనువిందుగా పూసినవి ఉయ్యాలో/ కట్లాయి పూలు ఉయ్యాలో/ కొమ్మల్లో పూసినవి ఉయ్యాలో/ గోరింట పూలు ఉయ్యాలో/ రుద్రాక్ష పూలు ఉయ్యాలో/ పూలన్నీ కోసి ఉయ్యాలో/ బుట్టల్లో నింపి ఉయ్యాలో/ వచ్చిన వరలక్ష్మి ఉయ్యాలో/ ఆడుతూ పాడుతూ ఉయ్యాలో/ బంగారుతపుకులో ఉయ్యాలో/ పేర్చనే బతుకమ్మ నుయ్యాలో” అంటూ ప్రకతిలో రంగురంగుల పూలను వర్ణిస్తూ బతుకమ్మ కోసం పూల సేకరణ చేసి బతుకమ్మను పేర్చే విధానం ఈ పాట తెలుపుతుంది.
”చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ/ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన/ రాగి బిందె తీసుక రమణి నీళ్లకు పోతే రాములోరు ఎదురైనమ్మో ఈ వాడలోన/ వెండి బిందే తీసుక వెలదీ నీళ్లకు పోతే వెంకటేశుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన” అంటూ యుక్త వయసు యువతల చిలిపితనాలను పాట రూపంలో వెల్లడిస్తుంది.
”శ్రీరాముడు మోటగట్టా వలలో/ సీత నీళ్లుగట్టా వలలో/ రఘురాముడు గొర్రుగట్టా వలలో/ జానకి నాటులెట్టా వలలో” అంటూ శ్రమ జీవన సౌందర్యాన్ని ఈ పాటలో తెలుపుతారు.
”పోపో బతుకమ్మ పొద్దున రా బతుకమ్మ/ పోతే పోతివి గాని గౌరమ్మ/ మళ్ళెప్పుడొస్తవు/ ఏడాదికొకసారి ఉయ్యాలో/ వస్తను పోతను ఉయ్యాలో” అంటూ నీళ్లలో బతుకమ్మ వదులుతూ పాడతారు.
”పసుపులో పుట్టి గౌరమ్మ/ పసుపులో పెరిగే గౌరమ్మ/ పసుపులో వసంతమాడంగా పొన్నంగిరిగి తాళ్లు/ పోలికలన్నీ వనాలు వనచిలుకలన్నీ గుప్పున ఎగిరే/ వనమెంతో గౌరీ ఉయ్యాలో/ కుంకుమ గులాలు ఉయ్యాలో/ ఎందుకో గౌరమ్మ ఉయ్యాలో” అంటూ బతుకమ్మ పేర్చిన తాంబాళాంలో చెరువులోని నీళ్లు కొన్ని తెచ్చి అందరి గౌరమ్మలను ఆ నీళ్లలో వేసి స్త్రీలందరూ తాంబాళాన్ని ఉయ్యాలూపుతూ పాట పాడి అందులోని పసుపును తమ మంగళసూత్రాలకు అడ్డుకుంటారు.
”ఏమేమి పువ్యొప్పునే గౌరమ్మ/ ఏమేమి కాయొప్పున గౌరమ్మ/ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ/ తంగేడు కాయొప్పుని గౌరమ్మ/ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలారా పాట సిల్కలార/ కల్కి సిల్కలారా కందమ్మ/ గుడ్డలు రానువోను అడుగులు/ తీరుద్ద ఆశలు తారుగోరింటలు/ ఘనమైన పొన్నపువ్వే గౌరమ్మ/ గజ్జల వడ్డాణమే గౌరమ్మ…” అంటూ సద్దుల బతుకమ్మ వేసి ఇంటికి వచ్చేటప్పుడు దారి పొడవునా ఆడపడుచులంతా పాడుతూ ఇల్లు చేరుతారు.
బతుకమ్మ ప్రకతితో ముడిపడిన పండుగ. పువ్వులని దేవుడుగా కొలవడం, తమ బతుకులను కష్టాలను పాటలుగా పాడుకోవడం ఒక్క తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ఇంత భక్తి శ్రద్దలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడా గుడి కనిపించదు. ఎవరికి బతుకమ్మ పేరు పెట్టుకోరు.
బతుకమ్మ పేర్చటంలో వాడే ఆకులు పూలు మంచి ఔషధాలు. వీటిని చెరువుల్లో కలపడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. అందుకే బతుకమ్మ పండుగ ప్రకతి పండుగ అయింది.
– డా|| తాళ్ళపల్లి యాకమ్మ, 9704226681