– తల్లిదండ్రులు, కుమార్తె మృతి
– కుమారుడు పరిస్థితి విషమం
పెద్ద చదువులు చదివి, బాగా అభివృద్ధిలోకి వస్తాడనుకున్న కొడుకు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. ఉన్నదంతా ఇచ్చినా అప్పులు తీర్చే పరిస్థితి లేకపోవడంతో ఆ కుటుంబం ఆత్మహత్యే శరణ్యమనుకుంది. తల్లిదండ్రులు, సోదరి ప్రాణాలు కోల్పోగా, ఆ యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈ ఘటన సంచలనం కలిగించింది.
స్థానికుల కథనం ప్రకారం… గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో నాగరాజురెడ్డి (61) తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. వ్యవసాయ పనులు, ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బులతో ఆ కుటుంబం గుట్టుగా జీవనం సాగిస్తోంది. తన కొడుకు దినేష్‌ను చిత్తూరులో బిటెక్ చదివిస్తున్నారు. తన భార్య జయంతి (54)ని కొడుక్కి తోడుగా చిత్తూరు పంపించి, నాగరాజురెడ్డి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లీకొడుకులిద్దరూ చిత్తూరులో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. నాగరాజురెడ్డి కుమార్తె సునీత (26) రాజస్థాన్‌లో ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తూ మూడు నెలల క్రితం ఇంటికి వచ్చారు. దినేష్ ‘ఆన్‌లైన్’ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. రూ.20 లక్షల వరకూ అప్పులు చేసినట్లు సమాచారం. నాగరాజురెడ్డి ముగ్గురు అన్నదమ్ములూ ఇటీవల ఆస్తి పంపకాలు చేసుకున్నారు. ఒక్కొక్కరికీ రూ.20 లక్షల చొప్పున ఆస్తులు వచ్చాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల కొడుకు అప్పుల పాలయ్యాడని తెలిసి నాగరాజురెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కూతురు పెళ్లికి, ఇతర అవసరాలకు పనికొస్తాయనుకున్న రూ.20 లక్షలలో రూ.10 లక్షల వరకూ కొడుక్కి సర్దుబాటు చేశారు. మరికొంత డబ్బులు కావాలని తండ్రితో దినేష్ గొడవ పడ్డాడు. దీంతో, ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. చివరికి బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. కుటుంబంలోని నలుగురూ పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజురెడ్డి (61) శుక్రవారం రాత్రి చనిపోయారు. ఆయన భార్య జయంతి (54), వారి కుమార్తె సునీత శనివారం మరణించారు. వారి కుమారుడు దినేష్ (23) చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందిన ఫిర్యాదు మేరకు సిఐ లక్ష్మీనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.