– భారత్, పాకిస్తాన్ ఢ నేడు
– ఒత్తిడిలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన
– ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్
భారత్, పాకిస్థాన్ క్రికెట్ వైరం మహిళల క్రికెట్‌లో ఎన్నడూ పెద్దగా కనిపించలేదు. కానీ ఆదివారం దుబారు వేదికగా భారత్, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరు అందుకు భిన్నం. తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూడగా.. పాకిస్థాన్ విజయంతో మొదలెట్టింది. ఆదివారం ఈ రెండు జట్లు ముఖాముఖి సమరానికి సై అంటున్నాయి.
దుబాయ్ (యుఏఈ)
భారీ అంచనాలతో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు వచ్చిన టీమ్ ఇండియా అమ్మాయిలకు ఆశించిన ఆరంభం దక్కలేదు. గ్రూప్ దశ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో పరాజయం ఎదురైంది. ఈ ఓటమి నుంచి కోలుకునే సమయం లేకుండానే అమ్మాయిలు మెగా మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. ప్రియ ప్రత్యర్థి పాకిస్థాన్‌తో నేడు టీమ్ ఇండియా తలపడనుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ సాధికారిక విజయం సాధించి ఉత్సాహంతో కనిపిస్తుంది. కచ్చితంగా విజయం సాధించాలనే తపనతో కనిపిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన నేడు దాయాదితో సమరంలో ఏం చేస్తుందో చూడాలి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ఆరంభం కానుంది.
పుంజుకుంటారా?
డబ్ల్యూపీఎల్ విజయంవంతం కావటంతో భారత మహిళల క్రికెట్ మరింత బలోపేతమైంది. ఇటీవల కాలంలో భారత మహిళల క్రికెట్ అత్యుత్తమ జట్టు ఇదే. బ్యాటింగ్, బౌలింగ్ సహా ఆల్‌రౌండ్ విభాగంలోనూ మన జట్టులో నాణ్యమైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. అయినా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మనోళ్లు నిరాశపరిచారు. ఎదురుదాడి వ్యూహం తిప్పికొట్టినా.. నేటి మ్యాచ్‌లోనూ అదే ప్రణాళిక అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు టాప్-3లో బ్యాటింగ్‌కు వస్తున్నారు. ఈ ముగ్గురు బ్యాటర్లు రాణిస్తేనే భారత్ భారీ స్కోరు చేయగలదు. మిడిల్ ఆర్డర్‌లో జెమీమా రొడ్రిగస్, రిచా ఘోష్, దీప్తి శర్మలు మంచి ఫామ్‌లో ఉన్నారు. యుఏఈ పిచ్‌లు, పరిస్థితులను అమ్మాయిలు వేగంగా అర్థం చేసుకుంటే పని మరింత సులువు కానుంది. హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి బంతితో కీలకం కానుంది. రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, పూజ వస్ట్రాకర్‌లు రాణించటంపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
జోరుమీదున్న పాక్
భారత్‌తో పోల్చితే పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు అండర్ డాగ్ అనే చెప్పాలి. పొట్టి ఫార్మాట్‌లో పాకిస్థాన్‌తో 15 మ్యాచులు ఆడితే మన అమ్మాయిలు 12 విజయాలు సాధించారు. టీ20 ప్రపంచకప్‌లో ఏడు మ్యాచుల్లో.. భారత్ ఐదింట విజయఢంకా మోగించింది. దీంతో నేటి మ్యాచ్‌లోనూ భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ సదియా ఇక్బాల్ జోరుమీదుంది. ఈ ఏడాది టీ20ల్లో సదియా వికెట్ల వేటలో ముందుంది. 15 మ్యాచుల్లోనే 24 వికెట్లు పడగొట్టింది. కెప్టెన్ ఫాతిమా సనా, అలియా రియాజ్, డయాన బేగ్, మునీబా అలీలు పాకిస్థాన్‌కు కీలకం.