అదనపు కట్నం భర్తల వేధింపులు

– బరించలేక పిల్లలతో సహా అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ప్రయత్నం
నవతెలంగాణ – కంటేశ్వర్
అదనం కట్నం కోసం సొంత అక్క చెల్లెల భర్తలు వేధింపులకు గురి చేయగా దానిని భరించలేక పిల్లలతో సహా అక్కా చెల్లెలు ఆత్మహత్య ప్రయత్నం చేశారు.నిజామాబాద్ నగర శివారులోని అశోక్ సాగర్ లో ఇద్దరు మహిళలు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యా యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా ఉన్న కొందరు, రోడ్డు వెంట వెళ్తున్న మరికొందరు ఇద్దరు మహిళలను, ఇద్దరు చిన్నారులను కాపాడారు. అందులో ఒక బాబు గల్లంతయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. నిజామాబాద్ ఆరవ టౌన్ ఎస్సె సాయికుమార్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని దుబ్బకు చెందిన అక్షయ ( 27), నికిత (25) ఇద్దరు అక్క చెల్లెలు. వారిద్దరిలో ఒకరిని మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్కు చెందిన వ్యక్తితో, మరొకరిని హైదరాబాద్ చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నం కింద నిజామాబాద్ కలెక్టరేట్ సమీపంలో గల సొంత ఆస్తిని ఇద్దరు కూతుళ్లకు 200 గజాల చొప్పున రాసిచ్చారు. కొత్త కలెక్టరేట్ అయిన తర్వాత అక్కడ భూముల రేట్లు పెరిగి చుట్టుపక్కల భూములన్ని కొనుగోలు జరిగిపోగా అక్షయ, నిఖితలకు తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చిన భూమి చుట్టూరా వెంచర్లు వెలిసి వారి ప్లాట్లకు వెళ్లే దారి లేకపోవడంతో సంబంధిత ప్లాట్లు అమ్మకం జరగడం లేదు. ఇద్దరి భర్తలు సంబంధిత ప్లాట్లను అమ్ముకొని వస్తేనే రావాలని వేధింపులకు గురి చేశారు. గతవారం పుట్టింటికి వచ్చిన అక్షయ, నికితలు తమ ప్లాట్లు విక్రయాలు జరగవని తమకు చావే శరణ్యం అని శుక్రవారం ఉదయం అశోక్ సాగర్లో దూకి ఆత్మ హత్యయత్నం చేశారు. అక్షయ తన కూతురు నమూ(3), నికిత తన కొడుకు భవేష్(3), కూతురు క్షేమ (1) తో కలిసి అశోక్ సాగర్లో దూకేశారు. అక్కడే బట్టలు ఉతుకుతున్న కొందరు అశోక్ సాగర్ రోడ్డు వెంట వెళ్తున్న మరికొందరు నీళ్లలో దూకి అక్షయ, నికిత, క్షేమ, నములను కాపాడారు. భవేష్ మాత్రం నీట మునిగి గల్లంతయ్యాడు. అతని కోసం గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నలుగురు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు.