మసీదుపై ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం

గాజా స్ట్రిప్‌: సెంట్రల్‌ గాజాలో ఓ మసీదుపై ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో 26 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. డెయిర్‌ అల్‌ -బలాహ్‌ పట్టణంలోని అల్‌-అక్సా అమరవీరుల ఆస్పత్రికి సమీపంలో ఉన్న ఈ మసీదు ఇటీవల శరణార్థి శిబిరంగా మారిందని, వందలాది మంది ఆశ్రయం పొందుతున్నారని గాజా పౌర రక్షణ సంస్థ ప్రతినిధి మహముద్‌ బస్సాల్‌ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ దళాలు బాంబులతో మసీదుపై దాడి చేశాయని అన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్ష్యులు పేర్కొన్నారు. ఈ దాడిపై ఇజ్రాయిల్‌ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. డెయిర్‌ అల్‌ – బలాహ్‌ ప్రాంతంలో గతంలో షుహాద్‌ అల్‌-అక్సా మసీదుగా ఉన్న నిర్మాణంలో హమాస్‌ ఉగ్రవాదులు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారని, వారి లక్ష్యంగా దాడి జరిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ నరమేథం.. ఏడాది మార్క్‌కు చేరుకోనుంది. ఇజ్రాయిల్‌ దాడులకు ప్రతిదాడిగా అక్టోబర్‌ ఏడున హమాస్‌ ఇజ్రాయిల్‌పై దాడి జరిపింది. అప్పటి నుండి ఇజ్రాయిల్‌ గాజా, వెస్ట్‌బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడిలో 42వేల మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.