మానసిక వికలాంగుల సంరక్షణ ఎవరిది?

Who cares for the mentally retarded?మానసిక ఆరోగ్య సమస్యలపై అవగహన కల్పించడం కోసం వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ (డబ్ల్యూఎఫ్‌ఎంహెచ్‌)1992 అక్టోబర్‌ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించింది. 1994 నుండి ఈ సంస్థ ప్రతి ఏడాది మానసిక ఆరోగ్యంపై నిర్థిష్టమైన థీమ్‌ను ప్రకటిస్తున్నది. మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ, అందరికి మానసిక ఆరోగ్యం లక్ష్యంగా థీమ్స్‌ ఉంటున్నవి.ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, స్వచ్చంద సంస్థల ద్వారా మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహనా పెంచేం దుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తున్నది. మానసిక వికలాంగులు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేసే పరిస్థితులు లేకపోవడం వలన పనిలో పాల్గొనలేక పోతున్నరనేది వాస్తవం. జనాభాలో 60 శాతం మంది పనిచేస్తున్నందున ప్రభుత్వాలు, యాజ మాన్యాలు కార్మికుల ఆరోగ్యం, భద్రతకు బాధ్యత వహించడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగు పర్చుకోవడం సులువు.కానీ, ఆది చేయాల్సింది ఎవరు?, మానసిక వికలాంగుల బాధ్యత ఎవరిది?
కోవిడ్‌-19 వలన ప్రజలు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించిన విషయం తెలిసిందే. మానసిక వికలాంగులపై దీని ప్రభావం తీవ్రంగా పడటమే కాదు, సామాజిక, ఆర్థిక అసమానతలను సృష్టించింది. ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారడం వలన ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టలేదు. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు మనదేశంలో ప్రజల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేశాయి. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం మౌలిక సదుపాయల కొరత, ఆరోగ్య నిపుణుల కొరత ఉంది. ప్రయివేటులో ఒక్క కౌన్సిలింగ్‌కు రూ.5వేల నుండి 10వేల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితి. ఇది సాధారణ ప్రజలకు భరించలేని భారం. బెంగళూరు లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్స్‌ చేసిన నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ సర్వే- 2018 రిపోర్ట్‌ ప్రకారం మన దేశంలో మానసిక రుగ్మతలు కలిగిన వారిలో 83శాతం మంది చికిత్స పొందలేక పోతున్నారు. మానసిక వైద్యుల సంఖ్య రోజురోజుకూ తగ్గడం ఆందోళన కలిగించే అంశం. ప్రజలకు అవసరమైన వైద్యసేవలే కాదు, వారిని మానసికంగా ధృడపరిచేందుకు మానసిక వైద్యులు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అవసరమన్న విషయం కేంద్రం గుర్తించడం లేదు. ఈ వైద్యుల సంఖ్య మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 0.05 ఉంటే కేరళ రాష్ట్రంలో 1.2 గా ఉంది. 2021లో ప్రతి లక్ష మందికి ముగ్గురు మానసిక వైద్యులను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం చేసినా అది అమలుకు నోచలేదు.
కేంద్ర ప్రభుత్వం మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం-1987కు సవరణలు చేస్తూ మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌ 2017ను ఆమోదించింది. దీని ద్వారా దేశంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మానసిక ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సేవలందించడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. చట్టం ప్రకారం మానసిక ఆరోగ్య సంరక్షణ, అమానవీయమైన, అవమానకరమైన పరిస్థితుల నుండి రక్షణ పొందడం, సమానత్వం, వివక్షత లేకుండా హక్కులు పొందడం, న్యాయ సహాయం పొందే హక్కు చట్టం కల్పించింది.కానీ మనదేశంలో చట్టం అమలులోకి వచ్చి ఏడేండ్లవుతున్న మానసిక ఆరోగ్య సంరక్షకులకు ఎలాంటి ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మెంటల్‌ హెల్త్‌ కేర్‌ను అమలు చేయడానికి కనీసం ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మానసిక ఆరోగ్య సమీక్షా కమిషన్‌ నేతృత్వంలో నిరంతరం సమీక్షలు చేయాలి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రభుత్వ అనుమతితో మానసిక ఆరోగ్య సమీక్షా బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆత్మహత్యలను నేరంగా పరిగణించడం,, ఆత్మహత్యలకు పాల్పడే వ్యక్తులను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా భావించాలి. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే 6నుంచి 24నెలలు జైలు శిక్ష, రూ.50వేల నుండి రూ.5లక్షల వరకు జరిమానా విధించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
ఆర్ధిక సర్వే 2023-24లో మొదటిసారిగా మానసిక ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటన చేసింది. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే 2015-16 రిపోర్ట్‌ ప్రకారం దేశంలో 10.6శాతం మంది పెద్దలు మానసిక రుగ్మతలతో బాధపడు తున్నారని, 70 శాతం మందికి వైద్యం అందుబాటులో లేదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతంలో 6.9శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.3శాతం, మెట్రో పాలిటన్‌ పట్టణాల్లో 13.5 శాతం మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నది ఈ నివేదిక తెలియజేసింది. ఎన్‌సిఈఆర్‌టీ నిర్వహించిన మానసిక ఆరోగ్యం, పాఠశాల విద్యార్థుల శ్రేయస్సు సర్వేలో కోవిడ్‌ 19 కారణంగా యువతలో మానసిక ఆరోగ్యం బలహీనంగా ఉందని, 11శాతం మంది మానసిక ఆరోగ్య సమస్యలతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, 14శాతం మంది తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారని పేర్కొన్నది. పేదరికం, ఒత్తిడితో కూడిన జీవన విధానం కూడా మానసిక ఆరోగ్యన్ని ప్రభావితం చేస్తున్నది. జాతీయ మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం, నేషనల్‌ టెలిమెంటల్‌ హెల్త్‌ పోగ్రామ్‌, మానసిక ఆరోగ్య సిబ్బందిని పెంచడం, ఆడోలసెంట్‌ ఫ్రెండ్లీ హెల్త్‌ క్లినిక్‌, పెర్‌ ఎడ్యుకేషన్‌ పోగ్రామ్‌ లాంటి వాటిని గ్రామస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆశా వర్కర్స్‌, అంగన్‌వాడీ స్థాయిలోనే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ద్వారా మానసిక రుగ్మతలను ముందే గుర్తిస్తే నివారించే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్య పాఠ్యంశాలను అభివృద్ధి చేయడం, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు, అధ్యాపకులలో అవగాహనా పెంచడానికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మానసిక ఆరోగ్య సంరక్షకుల సేవల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కమ్యూనిటీ ఆధారిత పునరావాస కార్యక్రమలను విస్తృత పరచాలి.మానసిక ఆరోగ్య రుగ్మతల ప్రభాల్యం పెరుగుకుండా ఉండేందుకు కృషి చేస్తూనే తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం అవసరం. ప్రతి జిల్లా కేంద్రంలో మానసిక వికలాంగుల పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్‌సలో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం వైద్యులను నియమించాలి. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే మానసిక ఆరోగ్య రుగ్మతల నిర్ములన సాధ్యమవుతుంది. మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌-2017అమలు కోసం ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది.

ఎం.అడివయ్య, 9490098713