కొత్త కంటెంట్‌తో సినిమాలను అందించేందుకు టాలీవుడ్ మేకర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌ఎన్ క్యూబ్ ప్రొడక్షన్ అనే కొత్త సంస్థ టాలీవుడ్‌లోకి అడుగిడింది. హెచ్‌ఎన్ క్యూబ్ ప్రొడక్షన్ లోగో, మోషన్ పోస్టర్‌ను గురువారం వ్యాపారవేత్త మహేష్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ప్రస్తుతం ఐదు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి. హిమ నందా గజా సమర్పణలో రామ్ నందా దర్శక, నిర్మాతగా హెచ్‌ఎన్ క్యూబ్ ప్రొడక్షన్‌లో వరుసగా ఐదు చిత్రాలు రాబోతోన్నాయి. దర్శక, నిర్మాత రామ్ నందా మాట్లాడుతూ, ‘రియల్‌ఎస్టేట్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చాను.2002 నుంచి సినిమా ఫీల్డ్‌లో ఉన్నాను. నాకంటూ ఓ మూవీ ఆఫీస్ 2002 నుంచే ఉండేది. ‘ప్రాణం’ సినిమాని నా ఫ్రెండ్ మల్లి చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రయాణించాను. సినిమాల మీద నాకు చాలా పట్టు ఉంది. హెచ్‌ఎన్ క్యూబ్ లోగోలో నా ఫ్యామిలీ మొత్తాన్ని సూచించేలా లోగోను నేనే రూపొందించాను. ప్రస్తుతం మా ప్రొడక్షన్ నుంచి ఐదు చిత్రాలు ‘ప్రేమలు- పెళ్లిళ్లు’, ‘మనసు’, ‘ఎల్‌ఎస్‌ఎల్‌ఎమ్’, ‘గతి’, ‘రామున్ని నేనే- రావణున్ని నేనే’ రాబోతోన్నాయి. అన్ని చిత్రాలకు సంబంధించిన కథలు, స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక దాని తరువాత ఒక చిత్రాన్ని చేస్తాను. ప్రేమలు, పెళ్లిళ్లు మూవీని ముందుగా సెట్స్ మీదకు తీసుకొస్తాను. ఇందులో కొత్త వారినే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రేమలు,పెళ్లిళ్లు సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేశాను’ అని తెలిపారు. ‘రామ్ నందాతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన సినిమాల్లోకి రావడం, ఒకేసారి ఐదు చిత్రాలు నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. ఆయనకు మంచి సక్సెస్ దక్కాలి’ అని వ్యాపార వేత్త మహేష్ రెడ్డి అన్నారు.