గోడదెబ్బ.. చెంపదెబ్బ… సొంతూళ్లలో దసరాను ఆనందంగా జరుపుకుందామనుకున్న సామాన్య జనాలకు ఇప్పుడు ఈ రెండుదెబ్బలు కలిసి పడుతున్నాయి. పిల్లాజెల్లాతో కలిసి ఊరెళదామ నుకుంటే కిక్కిరిసిపోతున్న బస్సులు, రైళ్లు, అయినా అవస్థలు పడుతూనే ఎలాగోలా ఎక్కిపోదామను కుంటే పండగ పేరుతో రెట్టింపు ఛార్జీల బాదుడు… వెరసి ప్రయాణమంటేనే ఆందోళన వ్యక్తమవు తోంది. గతేడాది వరకు పండగల సమయాల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయని ఆర్టీసీ…ఈ సంవత్సరం మాత్రం చడీచప్పుడు లేకుండా వాటిని వడ్డించింది. దసరాకు నడుపుతున్న ప్రత్యేక సర్వీ సుల బేసిక్ ఛార్జీలపై 50శాతం పెంచేసి ప్రయాణీకులపై తీవ్ర భారం మోపింది. దీంతో హైదరాబాద్- ఆదిలాబాద్, హైదరాబాద్- మంచిర్యాల, హైదరాబాద్-సత్తుపల్లి లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల ఛార్జీలు ఇప్పుడున్న దానికంటే సగటున రూ.150 నుంచి రూ.200 వరకు పెరగటంలో ఆయా సర్వీసుల్లో వెళ్లే జనాలకు చుక్కలు కనబడుతున్నాయి.
పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నా మంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు సెలవిస్తుండటం ఇక్కడ గమనార్హం. ఆయా సందర్భాల్లో ఒక రూట్‌లో వెళ్లేట ప్పుడు నిండుగా వెళుతున్న బస్సులు, తిరిగొచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి వస్తోందన్నది వారి వాదన. అందువల్ల ఆ నష్టాన్ని కొంతలో కొంత తగ్గించుకునేందుకే అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నామన్నది అధికారగణ వివరణ. వారి వాదనలో, వివరణలో నిజంగా సహేతుకత, శాస్త్రీయత ఉందా? అంటే నూటికి నూరు శాతం లేదనే అంటున్నారు రవాణారంగ నిపుణులు. ప్రజా రవాణా అయిన ఆర్టీసీని నష్టాల ఊబిలోంచి గట్టెక్కించి, లాభాల బాటలో పయనింపజేయాలంటే తాత్కాలిక రాబడి కోసం జనాలను బాదటం మాని, శాశ్వత ఆదాయాన్ని రాబట్టేందుకు మార్గాలను అన్వేషించాలన్నది నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నిటి అయోగ్ లెక్కలను తీసుకున్నా, రాష్ట్రంలోని ప్రయాణీకులు, బస్సుల సంఖ్య, ఆక్యుపెన్సీ రేషియో ప్రకారమైనా ప్రభుత్వం, ఆర్టీసీ చేపడుతున్న చర్యలు ఆ సంస్థను గట్టెక్కించకపోగా, ప్రజా రవాణా వ్యవస్థను ప్రయాణీకులకు దూరం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరగటమే కాదు, ఆ సంస్థ లాభాల బాటలోకి వచ్చిందనేది అధికారిక లెక్కల సారాంశం. ఈ పథకానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో ప్రతీరోజూ సగటున 35 లక్షల మంది ప్రయాణిస్తే, ఇప్పుడు ఆ సంఖ్య 55 లక్షలకు చేరింది. అంటే రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 20 లక్షలు పెరిగిందన్నమాట. కానీ పెరిగిన పాసింజర్ల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచకపోవటం గమనార్హం. మహాలక్ష్మిని ప్రవేశపెట్టకముందు 9,100 బస్సులుంటే, ఇప్పుడు కూడా వాటి సంఖ్య అంతే ఉండటం ప్రయాణీకుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. నిటి అయోగ్ లెక్కల(దేశ సగటు ప్రకారం)ను బట్టి జనాభాలో ప్రతీ వెయ్యి మందికి 1.2 బస్సులుండాలి. ఆ చొప్పున ప్రతీ పది వేల మందికి 12 బస్సులు, అదే లెక్క ప్రకారం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు 48 వేల బస్సులను ఆర్టీసీ తిప్పాలి. కానీ ఇప్పుడు మన తెలంగాణ రోడ్ల మీద తిరుగుతున్నది కేవలం 9 వేల బస్సులే. సర్కారుకు ప్రయాణీకుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 40 వేల బస్సులను కొనుగోలు చేసి, ప్రజా రవాణాను మెరుగుపరచాలి.
మహాలక్ష్మి పథకం తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు 100 నుంచి 137 శాతానికి పెరిగిందని సాక్షాత్తూ ఆర్టీసీ పెద్దలే చెబుతున్న క్రమంలో ఇక్కడ మనం ఓ విషయాన్ని గమనించాలి. నిబంధనల ప్రకారం ఒక్కో బస్సులో 50 మందికి మించి ప్రయాణించకూడదు. కానీ బస్సుల సంఖ్య పెరక్క పోవటం, ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ప్రస్తుతం సామర్థ్యానికి మించి 150 మంది వరకూ ప్రయాణిస్తున్నారు. దీంతో జనాలు తోసుకుంటూ, తొక్కుకుంటూ, కనీసం గాలి కూడా పీల్చుకునే వెసులుబాటు లేకుండా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణి స్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక అవాంఛనీయ సంఘటలు చోటుచేసుకున్నాయి. మున్ముందు జరగరానిదే మైనా జరిగితే దానికి బాధ్యులెవరు?
ఇలా గణాంకాలు, లెక్కలు, వాస్తవ పరిస్థితులన్నింటినీ చూస్తే… ప్రజల అవసరాలకు అను గుణంగా, ప్రయాణీకుల సంఖ్య, ఆక్యుపెన్సీ రేషియో ఆధారంగా బస్సుల సంఖ్యను పెంచటం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాల్సిన ఆర్టీసీ, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. ఇదే సమ యంలో ‘పండగలప్పుడు ప్రయివేటు ట్రావెల్స్ ఛార్జీలను బాదితే తప్పులేదుగానీ, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవటానికి మేం కొంచెం పెంచితే గగ్గోలెందుకు..?’ అంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు వితండ వాదన చేయటం విడ్డూరం. అయినా ప్రయివేటు ట్రావెల్స్ అడ్డగోలు దందాను అడ్డుకుని, వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఆర్టీసీదే కదా? ఆ పని చేయకుండా ప్రయాణీకులపై భారాలు మోపితే ఏం లాభం?