కొంతమంది కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతారు

– నల్లగొండలో అన్ని సీట్లు కారుకే…
– రేవంత్‌ పార్టీ మారలేదా?
– ఇష్టాగోష్టిలో మండలి చైర్మెన్‌ గుత్తా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రానున్న రోజుల్లో కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతారని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులకు రాష్ట్రంపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వచ్చేఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో అన్ని స్థానాల్లో కారు పరుగుపెడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం శాసనమండలిలోని తన ఛాంబర్‌లో ఇష్టాగోష్టిలో విలేకర్లతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేయబోనని తెలిపారు. తన కుమారుడికి పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటారని చెప్పారు. కేసీఆర్‌ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. కాంగ్రెస్‌లో చేరుతామంటూ చెప్పుకునే ఖమ్మం, మహబూబ్‌నగర్‌ నేతలు వాళ్ళ గురించి వాళ్లే ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని తన కోరిక అని చెప్పారు. జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేది సహజమన్నారు. జిల్లా నాయకత్వంపై పూర్తిస్థాయి సంతృప్తి ఎక్కడా ఉండదని చెప్పారు. ఎన్నికలు వచ్చినపుడల్లా చేరికలు, మార్పులు, చేర్పులు అనేది సహజమేనన్నారు. ఖమ్మంలో 2018 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు బీఆర్‌ఎస్‌కు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్‌ లేకుండానే కూటమి అని సీఎం కేసీఆర్‌ అంటున్నాడు కాబట్టే ఆయన విపక్ష సమావేశాలకు పోవడం లేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లోకి వెళ్లబోరని స్పష్టం చేశారు. తమ వారసుల కోసం వేరే పార్టీలోకి వెళ్లబోమనీ, అవకాశం రాకపోతే పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తామన్నారు. వారసత్వ రాజకీయాలు అనేవి కేవలం గుర్తింపు వరకు మాత్రమేనన్నారు. అవి విజయం సాధించేందుకు పనికి రావన్నారు. రేవంత్‌రెడ్డి మాటలకు అంతూ పొంతూ ఉండదనీ, ఆయన మాత్రం పార్టీ మారలేదా? అని ప్రశ్నించారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కేంద్రం తీసుకురావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందే తప్ప ఒక్క న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు కేంద్రం పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు.