పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా దో కమీనే

Do Kamine as a pan India projectదర్శకుడు వి.సముద్ర వారసులు అరుణ్‌ మహాశివ, రామ్‌ త్రివిక్రమ్‌ హీరోలుగా ‘దో కమీనే’ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హారిక సమర్పణలో చందు క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ప్రొడ్యూసర్‌ చంద్ర పులుగుజ్జు నిర్మిస్తున్నారు. సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తస్మయి, శ్రీ రాధ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సుమన్‌ క్లాప్‌ నివ్వగా, దర్శకులు బి.గోపాల్‌ ఫస్ట్‌ షాట్‌ డైరెక్షన్‌ చేశారు. హీరో శ్రీకాంత్‌ స్క్రిప్ట్‌ అందించారు. నందమూరి మోహనకష్ణ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ వి.సముద్ర మాట్లాడుతూ, ‘పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ‘షోలే’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కలిపితే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది. నా మిత్రుడు చంద్ర ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. నవంబర్‌ 3వ వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. మా మూవీ రిలీజ్‌ అయ్యాక దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘మా చంద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాను ఘనంగా లాంచ్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది. సముద్ర దర్శకత్వంలో ఒక మంచి మూవీతో మీ ముందుకు రాబోతున్నాం’ అని నిర్మాత చంద్ర పులుగుజ్జు చెప్పారు. హీరోలు రామ్‌ త్రివిక్రమ్‌, అరుణ్‌ మహాశివ మాట్లాడుతూ,’నాన్న దర్శకత్వంలో నటించాలనేది మా డ్రీమ్‌. ఆ కల ఇంత త్వరగా నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. అందుకు మా ప్రొడ్యూసర్‌ చంద్రకి థ్యాంక్స్‌ చెబుతున్నాం. త్వరలోనే ఒక మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం’ అని అన్నారు.