అలా ఉంటే ఎదగలేం!

If so, we can't grow!– ఏ పరిస్థితుల్లోనైనా ఆడటమే కీలకం
– భారత చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌
విజయం కోసం ఒక్క రోజులో 400 పరుగులు అవసరమైతే బ్యాటర్లు అందుకు సిద్ధంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో డ్రా కోసం రెండు రోజుల పాటు బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే.. బ్యాటింగ్‌ లైనప్‌ అందుకూ సంసిద్ధంగా ఉండాలి. ఒకే శైలిలో ఆడితే ఆటలో ఎప్పటికీ ఎదగలేము. భిన్న పరిస్థితులకు తగినట్టు విభిన్న శైలిలో రాణిస్తేనే ఎదిగేందుకు అవకాశమని భారత చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముంగిట బెంగళూర్‌లో గంభీర్‌ మీడియాతో మాట్లాడాడు.
నవతెలంగాణ-బెంగళూర్‌ :
అడాప్టబిలిటీ ప్రధానం: టెస్టు క్రికెట్‌ గతంలో మాదిరిగా లేదు. అందుకు తగినట్టు భారత క్రికెట్‌ సైతం వేగంగా ముందుకు సాగాలి. పరుగుల వేటలో బ్యాటర్లు బౌండరీ బాదే అవకాశాల కోసం ఎక్కువగా చూస్తున్నారు. అయినా, ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో అడాప్టబిలీటీ అత్యంత ప్రధానం. ఒక్క రోజులో 400 పరుగులు చేయగల, డ్రా కోసం రెండు రోజుల పాటు బ్యాటింగ్‌ చేయగల జట్టుగా నిలవాలనేది మా లక్ష్యం. దానిని మీరు ఎదుగుదల, అడాప్టబిలిటీ, టెస్టు క్రికెట్‌ అని ఏమైనా అనవచ్చు. నా వరకు ఒకే ధోరణిలో ఆడితే ఎప్పటికీ ఎదుగుదల ఉండదు. ప్రపంచ క్రికెట్‌, ఇతర జట్ల గురించి నేను మాట్లాడలేను. ప్రతి జట్టుకు ఓ ప్రత్యేక దృక్పథం ఉంటుంది. టెస్టు క్రికెట్‌లో ప్రత్యేక ప్రణాళికలు ఉంటాయి. అందుకే నేను నా జట్టు గురించి మాత్రమే మాట్లాడగలను. ఏ పరిస్థితుల్లోనై సవాల్‌ను స్వీకరించి భారత్‌ను విజయపథాన నడిపించే ఆటగాళ్లు మా డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉన్నారు.
మా మద్దతు ఉంటుంది: హై రిస్క్‌-హై రివార్డ్‌ అప్రోచ్‌పై మాకు ఓ స్పష్టత ఉంది. ఆటగాళ్లు సహజశైలిలో విధ్వంసక శైలిలో ఆడాలని కోరుకుంటున్నాం. సహజశైలిలో ఆడి 400-500 పరుగులు ఓ రోజులో చేయగలిగితే అదే దారిలో నడుస్తాం. హై రిస్క్‌- హై రివార్డ్‌లో హై రిస్క్‌-హై ఫెయిల్యూర్‌ ప్రతికూలతలు తెలుసు. దూకుడు ఆడితే ఓ సమయంలో 100 పరుగులకే కుప్పకూలే ప్రమాదం ఉంటుంది.అయినా, వెనక్కి తగ్గం. ఆటగాళ్లకు పూర్తిగా మద్దతుగా నిలుస్తాం. టెస్టు క్రికెట్‌లోనూ ఈ దేశ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయటమే మా లక్ష్యం. ఎటువంటి పరిస్థితుల్లోనే ఫలితం కోసం ప్రయత్నించటమే మా ప్రణాళిక.
ప్రత్యర్థిని గౌరవిస్తాం: న్యూజిలాండ్‌ పూర్తిగా భిన్నమైన జట్టు, భారత్‌కు భిన్నమైన సవాల్‌. కివీస్‌ ఎంతో మంచి జట్టు. ఆ జట్టులో ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. మన జట్టును ఇరకాటంలో పడేయగల క్రికెటర్లు ఆ శిబిరంలో ఉన్నారు. కివీస్‌ ఎప్పుడూ పొరాడేందుకు చూస్తుంది, మేం కూడా ఆ జట్టును అదే అంచనా వేస్తున్నాం. ప్రత్యర్థిని గౌరవిస్తాం కానీ ఎవరికీ భయపడం. ప్రతి జట్టునూ గౌరవిస్తాం. అది కివీస్‌ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు.. అందరినీ ఒకేలా గౌరవిస్తాం.
ఫోకస్‌ ఈ సిరీస్‌పైనే: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025 జూన్‌లో షెడ్యూల్‌ చేశారు. ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ నవంబర్‌ 22న ఆరంభం కానుంది. కానీ ఇప్పుడు టీమ్‌ ఇండియా ఫోకస్‌ న్యూజిలాండ్‌తో సిరీస్‌పైనే. అంతర్జాతీయ క్రికెట్‌లో అతిగా ఆలోచన చేయలేం. ఇప్పుడు మా ముందున్న సవాల్‌ న్యూజిలాండ్‌. అక్టోబర్‌ 16న ఉదయం 9.30 గంటలకు కివీస్‌ కోసం ఏ విధంగా సిద్ధం అవ్వాలనేది మా ఆలోచన. ఏ మ్యాచ్‌లో ఆడినా, ఏ సిరీస్‌లో తలపడినా మా లక్ష్యం గెలుపే.