వాహన అమ్మకాలు వెలవెల

వాహన అమ్మకాలు వెలవెల– పివి విక్రయాల్లో 2 శాతం క్షీణత
– 11 శాతం తగ్గిన వాణిజ్య వాహనాలు
– సియోమ్‌ వెల్లడి
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు గీటురాయిగా భావించే వాహన అమ్మకాలు పడిపోయాయి. పండగ సీజన్‌లో పెరగాల్సిన అమ్మకాలు.. తగ్గిపోవడంతో పరిశ్రమ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 1.8 శాతం పతనమై 10,74,395 యూనిట్లకు పరిమితమయ్యాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్‌ఫాక్చరర్స్‌ (సియోమ్‌) ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇదే సమయంలో ఎగుమతులు 13.3 శాతం పెరిగి 13,35,681 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి.
సోమవారం సియోమ్‌ వెల్లడించిన గణంకాల ప్రకారం.. గడిచిన సెప్టెంబర్‌ త్రైమాసికంలో వాణిజ్య వాహన అమ్మకాలు ఏకంగా 11 శాతం క్షీణించి 2,20,643 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2023-24 ఇదే క్యూ2లో 2,47,801 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం క్యూ2లో భారీ, మధ్య తరహా వాణిజ్య వాహన విక్రయాలు 12.2 శాతం పతనమై 82,409 యూనిట్లుగా నమోదయ్యాయి.. తేలికపాటి వాణిజ్య వాహన విక్రయాలు 10.2 శాతం పతనమై 1,38,234 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం క్యూ2లో ద్విచక్ర వాహన అమ్మకాలు మాత్రం 12.6 శాతం పెరిగి 51,79,349 యూనిట్లు చోటు చేసుకున్నాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 6.6 శాతం పెరిగి 2,08,718 యూనిట్లుగా నమోదయ్యాయి.
రాణించిన ఎగుమతులు..
గడిచిన సెప్టెంబర్‌ త్రైమాసికంలో ప్యాసింజర్‌ వెహికల్‌ ఎగుమతులు 6.3 శాతం పెరిగి 1,96,196 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహనాలు 16 శాతం పెరిగి 19,990 యూనిట్లుగా ఉండగా.. త్రిచక్ర వాహనాలు స్వల్పంగా పెరిగి 81,918 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. ద్విచక్ర వాహన ఎగుమతులు ఏకంగా 15.8 శాతం 8,94,591 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా ఎగుమతులు 13.3 శాతం పెరిగి 13,35,681 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. దేశీయ అమ్మకాలు పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి నిదర్శనం. ప్రజల ఆదాయాలు తగ్గిపోవడం వల్లే వాహన అమ్మకాలు పడిపోతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్రమంగా అన్ని రంగాల్లోనూ స్తబ్దత చోటు చేసుకోనుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది.