దేశానికి గొప్ప సంపద యువత

– వచ్చే 25 సంవత్సరాలలో దేశం నెబర్ వన్ స్థానంలో ఉంచాలన్నదే మోడీ లక్ష్యం
– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
నవ తెలంగాణ – సిద్దిపేట
ప్రపంచంలో ఏ దేశానికి లేని సంపద భారతదేశానికి ఉందని, ఆ గొప్ప సంపద యువత అని , జనాభాలో 65 శాతం యువత ఉన్న దేశం మనదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నెహ్రు యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఆజాద్ కి అమృత్ కాల్ కార్యక్రమాన్ని శనివారం పట్టణంలోని విపంచిలో నిర్వహించారు. యువతకు, విద్యార్థులకు ఫోటోగ్రఫీ, రచన, కవిత్వం, చిత్రలేఖనం, సాంస్కృతిక కార్యక్రమాలపై పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో దేశ జనాభాలో మనము మొదటి స్థానంలో ఉన్నామని, మన దేశాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉంచడానికి నరేంద్ర మోడీ గత తొమ్మిది సంవత్సరాలుగా కృషి చేస్తున్నారని అన్నారు. కరోనా లాంటి సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ ను అందించిన ఘనత మన దేశానికి దక్కిందన్నారు. మోడీ 9 సంవత్సరాల పాలనలో ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళిన భారతీయుడు అని గర్వంగా చెప్పుకునేలా చేశారని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మనము ఐదో స్థానంలో ఉన్నామని అన్నారు. ప్రస్తుతం 75 వసంతాల నుండి వచ్చే 25 సంవత్సరాల లోపు మన దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారని, అందుకు యువత సహకరించాలని అన్నారు. నా చిన్నతనంలో ఒలంపిక్స్ ఆటలలో భారతదేశ స్థానం గురించి వెతికే వాడినని, ఇప్పుడు తీరు మారిందని అన్నారు. ఉపాధ్యాయులు పిల్లల యొక్క ఆసక్తిని గ్రహించి ఆ ఆసక్తి తీరే విధంగా వారికి సహకరించాలని సూచించారు. ప్రభుత్వ బడులో ప్రభుత్వ విద్య బలోపేతం అయినదని, విద్యతోపాటు క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను యూపీ మాదిరిగా ప్రభుత్వ బడులలోనే చదివించాలని అన్నారు. ప్రస్తుతం మన దేశంలో డయాబెటిస్, ఉబకాయంతో బాధపడుతున్నామని, అవి తగ్గాలంటే ప్రతి రోజు ఉదయం యోగా చేయాలని, గ్రౌండ్ కు వెళ్లి ఆటలు ఆడాలని అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను, వారి నైపుణ్యాన్ని పెంచే విధంగా నెహ్రూ యువజన కేంద్రం శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఇక్కడ ఎక్కువగా బాలికలే కనబడుతున్నారని, మీ చైతన్యం ఈ విధంగా ఉండాలని, మహిళా చైతన్యవంతురాలు అయితే కుటుంబం చైతన్యవంతం అవుతుందని అన్నారు. అంతకు ముందు ట్రైని కలెక్టర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ పంచప్రాన్ అంశాల పట్ల యువత తెలుసుకోవాలని, మీరు ఇక్కడ గెలుపొంది, రాష్ట్రస్థాయికి, అక్కడి నుండి జాతి స్థాయిలో పాల్గొని ఈ ప్రాంతానికి పేరు తేవాలని సూచించారు. జిల్లా క్రీడా శాఖ అధికారి నాగేందర్ మాట్లాడుతూ యువత, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పైన ఆసక్తి చూపాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ వై కే కోఆర్డినేటర్ రంజిత్ రెడ్డి, అధికారి కిరణ్, విభీషణ్ రెడ్డి, నర్సింలు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.