నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నిలకు సంబంధించి వచ్చే డిసెంబరు 30 వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే తెలిపారు. బుధవారం నాడు కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజక వర్గం ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజక వర్గం ఎన్నికలకు సంబంధించి రివిజన్ షెడ్యూలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే నవంబరు 6 వ తేదీ ఫారమ్ 19 దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ అని తెలిపారు. నవంబరు 23 వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని, వీటిపై మార్పులు, తొలగింపులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు నవంబరు 23 నుండి డిసెంబరు 9 వరకు స్వీకరించడం జరుగుతుందని, వచ్చే డిసెంబరు 25 న దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, డిసెంబరు 30 వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్ డివిజన్ లకు సంబంధించి ఇప్పటి వరకు 16 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. భువనగిరి డివిజన్ లో 12 పోలింగ్ కేంద్రాలు, చౌటుప్పల్ డివిజన్ లో 5 పోలింగ్ కేంద్రాలతో మండలానికి ఒక్కటి చొప్పున మొత్తం 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు బట్టు రామచంద్రయ్య, బట్టుపల్లి అనురాధ, ఆబోతుల కిరణ్ కుమార్, రత్నపురం బలరాం లు పాల్గొన్నారు.