– అయినా రియంబర్స్మెంట్ రాలే
– ప్రజా ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి
– ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మారం నాగేందర్ రెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు లోనవుతున్నాయని, చివరకు కళాశాలలు బంద్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు మారం నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాలు కళాశాలలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని కాకతీయ డిగ్రీ కళాశాల నుండి గడియారం సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు కళాశాలలను మూసివేశారని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకoగా మారిందని ఆవేదనచెందారు. యాజమాన్యాలు ఆర్ధిక ఇబ్బందులకు లోనవుతూ ఆధ్యాపకులు, సిబ్బంది వేతనాలు, కరెంట్ బిల్లులు, మున్సిపల్ టాక్సీలు, భవనాల అద్దెలు, యూనివర్సిటి ఫీజులు చెల్లించలేక అప్పుల పాలై చేసేదేమీ లేక చివరకు కళాశాలలను మూసి వేశారని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిన విద్యార్థుల ఉపకారవేతనాలు, భోదన రుసుములు చెల్లించడంలో నిర్లక్షం వహిస్తుందని ఆరోపించారు. టోకెన్లు ఇచ్చి పదినెలలు గడిచినా ఇప్పటి వరకు రీయంబర్స్మెంట్ చెల్లించకపోవడం అన్యాయం ఆన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో వుంచుకుని ప్రజాప్రభుత్వం వెంటనే స్పందించి రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాoమ్మోహన్, నరసింహారెడ్డి, జానయ్య, సత్యం గౌడ్, ప్రవీణ్, హనుమంతు, వెంకట్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్, కళాశాలల యాజమాన్యాలు, ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.