– విద్యాకమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళితో ఇంటర్ విద్యాజేఏసీ భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్ విద్యావ్యవస్థ బలోపేతం కోసం విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళితో ఇంటర్ విద్యా జేఏసీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. బుధవారం హైదరాబాద్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, జాతీయ విద్యా విధానంపై చర్చించారు. ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ పుట్టుక, పరిణామాలు, కార్పొరేటీకరణ వంటి అనేక అంశాలపైన చర్చ జరిగింది. ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలవుతున్న విధానాలు, నూతన విద్యా విధానం నేపథ్యంలో ఇంటర్ విద్యా వ్యవస్థ భవిష్యత్తు, నూతనంగా ఏర్పాటుచేసిన సమీకృత గురుకులాల వ్యవస్థ ఇలా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ పి మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళింగ కృష్ణకుమార్, జీజేఎల్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, టీజీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం తదితరులు పాల్గొన్నారు.