అప్పులు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పాత అప్పులకు కిస్తీల కోసమే మళ్లీ రుణాలు తెస్తున్నామంటూ అధికార కాంగ్రెస్ అంటుండగా, రూ. వేల కోట్లు అప్పులు తెచ్చి ఒక్క పథకాన్ని సరిగ్గా అమలు చేయట్లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు నిధులలేమీ పేరుతో పథకాలు, ప్రాజెక్టులను ప్రయివేటుకు అప్పగించే ప్రణాళికలు చేస్తున్నదా? అనే ప్రశ్న సహేతుకమే. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టు పైసల్లేవని చెప్పి ఇచ్చిన రాజకీయ హామీలను తుంగలో తొక్కిన చరిత్ర బీఆర్ఎస్ది. ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహారాలు చేస్తే ఎవరూ ఊరుకోరు. బిల్లులు చెల్లించాలంటూ వర్కింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు, సర్పంచులు రెండేండ్లుగా ఎదురు చూస్తున్న మాట పచ్చినిజమే కదా? బీఆర్ఎస్ కాలం నుంచే పెండింగ్ బిల్లులు సమస్య ఉంది. అది నేటికీ కొనసాగుతోంది. చివరకు చోటామోటా కాంట్రాక్టర్లు, సర్పంచుల, ఎంపీటీసీలు చేసిన పనులకూ నిధుల కొరత తప్పడం లేదు. మూడేండ్ల కింద సర్పంచుల కుటుంబాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాయి. ఒక సర్పంచ్ అసువులు బాశాడు కూడా. బడా కాంట్రాక్టర్లకు వెండిపళ్లెంలో పెట్టి బిల్లులు విడుదల చేసే ప్రభుత్వాలు, గ్రామాభివృద్ధి కోసం ఇంట్లో భార్యల పుస్తెలు తాకట్టుపెట్టి, అప్పులుచేసి పనులు చేసినవారికి నిధుల లేమిని అడ్డంకిగా చూపడం అన్యాయం.
ఈ దుర్భర పరిస్థితిని కేంద్రం చోద్యం చూస్తున్నది. సమాఖ్యతత్వాన్ని మరిచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు పూర్తిగా ఇవ్వకపోవడం, ఇచ్చినా అరకొరగానే విదల్చడం రోటీన్ అయి పోయింది. మోడీ సర్కార్ నుంచి రావాల్సిన సాధారణ నిధులూ తెలంగాణకు మృగ్యమవుతున్నాయి. హక్కుగా ఇవ్వాల్సిన పైసలను సైతం పెద్దన్న పట్టించుకోకపోవడం ప్రజల జీవన హక్కును కాల రాయ డమే. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది. కొత్త సర్కారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో రూ. 49,618 కోట్ల అప్పు తీసుకుంది. మూల ధనం కింద రూ.21,881 కోట్లు ఖర్చు చేసింది. రుణమాఫీ, రైతుభరోసా, చేయూత, విద్యుత్, బియ్యం, గ్యాస్ రాయితీలు, మహలక్ష్మి, గృహజ్యోతి స్కాలర్షిప్లు, ఆర్టీసీ, కళ్యాణలక్ష్మి పథకాల కోసం రూ.54,348 కోట్లు వ్యయమైనట్టు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రకటించింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల కోసం కిస్తీలు కట్టేందుకు రూ.56,440 కోట్లు వినియోగించినట్టు పేర్కొంది. ఈనేపథ్యంలో కొత్తగా అప్పులు తీసుకుంటున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించే పరిస్థితి లేకుండా పోయిందని తెలియ జేసింది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రం తాజా అప్పులు రూ.7 లక్షల కోట్లు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రూ.3 లక్షల కోట్లు.
బీజేపీ సర్కారు ఈ నిధులివ్వడంలో చేస్తున్న అలవికాని ఆలస్యం మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టబడుతున్నది. నాణానికి ఇదో పార్శ్యం. మరో పార్శ్యం ఏమిటంటే, కాసులు లేవనే పేరుతో ప్రాజెక్టులను, పథకాలను ప్రయివేటు, కార్పొరేట్ల ధారాదత్తం చేసే కుట్ర దాగున్నట్టు కనిపిస్తున్నది! మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును పూర్తిగా ప్రయివేటుకే ఇచ్చేందుకు సర్కారు సమాయత్తమవుతున్నది. మరో 18నెలల్లో డీపీఆర్ తయారు కానుంది. చివరకు పంచభూతాలకూ వెలకట్టే దారుణ దుస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రపంచ దేశాల్లో సాగుతున్న ప్రత్యేక అధ్యయనాలే నిదర్శనం. నీటికి ఖరీదు కట్టే ప్రయత్నాలూ చోటుచేసుకుంటున్నాయి. ‘నీటి సంక్షోభం-ఆర్థిక పరిస్థితిపై ప్రభావం’ అనే ఆంశంపై గ్లోబల్ కమిషన్ ఆన్ ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ అనే సంస్థ చేసిన అధ్యయనమే ఈ సంగతిని తేటతెల్లం చేసింది. ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉండటం, భూ వినియోగంలో లోపాలు, నీటి యాజమాన్యం సమర్థంగా లేకపోవడంతోపాటు వాతావరణ మార్పులు సమస్యల ను మరింత జటిలం చేస్తున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో 50 శాతానికి పైగా ఆహారోత్పత్తి ప్రమాదంలో పడనుందని తేల్చింది. నీటి వనరుల విస్తీర్ణం తగ్గిన కారణంగా అనేక నగరాల్లో సంక్షోభస్థితి నెలకొన్నదని విశ్లేషించింది. నీటి వినియోగం మరింత సమర్థవంతంగా చేయడానికి వీలుగా తగిన ధర నిర్ణయించాలనే ప్రమాదకరమైన ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. రేటును నిర్ణయిస్తే నీటి వినియోగంలో అనేక మార్పులు వస్తాయని డబ్ల్యూటీవో డైరెక్టర్ అభిప్రాయం. ఆర్థికవ్యవస్థలు కుదేలవుతున్న తరుణంలో ప్రయివేటు, కార్పొరేట్ రంగానికి సమస్త ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే కుయత్నాలు జరుగుతుండటం ఆందోళనాకరం. వీటిని ప్రజాప్రభుత్వాలు అడ్డుకోవాలి. పేదలను నిధులలేమి పేర కష్టాల్లోకి నెట్టకుండా, ఆర్థిక ఆసరాను ఇవ్వడం ప్రాథమిక కర్తవ్యంగా భావించి ఆదుకోవాలి.