గీతా కార్మికుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలి 

More funds should be allocated for the welfare of Geetha workers– కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు రవి గౌడ్ 
నవతెలంగాణ – పెద్దవంగర
గీతా కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అనపురం రవి గౌడ్ అన్నారు. శుక్రవారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కల్లు గీతా కార్మిక సంఘం 67 వార్షికోత్సవానికి మండలం నుండి గౌడ సంఘం నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న ప్రభుత్వాలు మారినవి తప్పా, కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంఘానికి కేటాయించిన నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల గీత కార్మికుల జీవితాలలో ఎలాంటి మార్పు లేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం కల్లు గీత కార్మికుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వృత్తి రక్షణ కోసం గీత కార్మికుల యువత ఉపాధి అవకాశాలు మెరుగు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గీత కార్మికులందరికీ మోటర్ బైక్ లు ఇవ్వాలని. గీత కార్మికులు సహజ మరణం పొందిన ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా గీతన్న బీమా పథకాన్ని అమలు చేయాలని, ప్రతి గీత కార్మికుల కుటుంబానికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణం ఇవ్వాలన్నారు. గీతన్నలకు ఎక్స్గ్రేషియా పది లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొయ్యడి యాకన్న, అయోధ్య, సంపత్, ప్రభాకర్, సోమయ్య, బెల్లంకొండ సోమయ్య, రాజు, బండి లచ్చయ్య, మల్లేష్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.