క్యాబినెట్‌ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలి

– మద్రాస్‌ హైకోర్టు పునరుద్ఘాటన
చెన్నై : రాష్ట్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను పాటించటానికి గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉండాలని మద్రాసు హైకోర్టు పునరుద్ఘాటించింది. తనను త్వరగా విడుదల చేయాలంటూ జీవితఖైదు అనుభ విస్తున్న ఒక ఖైదీ వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. పై విధంగా స్పందించింది. ఒక హత్య కేసులో పుఝల్‌ జైలులో పిటిషనర్‌ వీరభారతి జీవితఖైదు అనుభవిస్తున్నారు. తనను త్వరగా విడుదల చేయాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను ఇప్పటికే 20 ఏండ్లు జైలులో శిక్షను అనుభవించాననీ, సత్ప్రవర్తన కింద తనను విడుదల చేయాలంటూ అంతకముందు జైళ్లశాఖ డీజీపీ నేతృత్వంలోని కమిటీకి పిటిషన్‌ను సైతం అందిచాడు. ఇవే నేరాలకు సంబంధించి దోషులుగా తేలిన ఖైదీలు త్వరగానే విడుదలయ్యారని వీరభారతి వాదించారు. పూర్తి రివ్యూ తర్వాత రాష్ట్ర కమిటీ తన విడుదలకు సిఫారసు చేసిందని వివరించారు. ఈ సిఫారసును సీఎంకు పంపించటం, ఆ తర్వాత రాష్ట్ర క్యాబినేట్‌ ఆమోదం పొంది తుది అనుమతి కోసం గవర్నర్‌ వద్దకు వెళ్లిందని పేర్కొన్నాడు. అయితే, తన విడుదలకు గవర్నర్‌ ఆమోదం తెలపలేదని వీరభారతి వివరించారు. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్‌ వి. శివజ్ఞానం లతో కూడిన ధర్మాసనం.. భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషి అయిన పెరారివాలన్‌ వంటి కేసులను ఉటంకించింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ విషయంలో కోర్టు పై విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత గవర్నర్‌కున్నదని న్యాయస్థానం నొక్కి చెప్పింది. మరోపక్క, వీరభారతి పిటిషన్‌ను పునర్విచారణకు ఆదేశించిన ధర్మాసనం.. ఆయనకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌కు మధ్య గత కొంత కాలంగా సఖ్యత లేని విషయం విదితమే. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.