విద్యార్థి దశ నుంచే చట్టాల పట్ల అవగాహన ఉండాలి

From the stage of student should be aware of the lawsనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
విద్యార్థి దశ నుంచే చట్టాల పట్ల అవగాహన పెంచుకొని తగిన విధంగా రక్షణ పొందాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య విద్యార్థినులకు సూచించారు. శనివారం పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల సంరక్షణకు రూపొందించిన చట్టాలు, అఘాయిత్యాలకు పాల్పడిన సందర్భంలో నేరస్తులకు వేసే శిక్షలపై వారికి అవగాహన కల్పించారు. ఫోక్సో, జువైనల్ చట్టాలతో పాటు ర్యాగింగ్ యాక్ట్. బాలికా సంరక్షణ చట్టాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఎ కార్యాదర్శి సౌజన్య మాట్లాడుతూ చట్టాలపై అవగాహన ఉన్నపుడే వాటి ద్వారా రక్షణ పొందగలుగుతామని.. ఈదిశగా విద్యార్థినులు చట్టాల గురించి తెలుసుకుంటూ తమకు గాని తోటి వారికి గాని ఆన్యాయం, అకృత్యం జరిగినపుడు న్యాయం పొందవచ్చని సూచించారు. వేదింపులకు గురైన సందర్భంలో నిర్భయంగా తమ ఉపాధ్యాయులకు గాని, తల్లిదండ్రులకు గాని తెలియజేయాలని సూచించారు. అలాగే సఖి కేంద్రాల ద్వారా సైతం రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, న్యాయరక్షకులు గంగారాం, అశోక్, ఉమేష్ రావ్, ప్యానల్ అడ్వకేట్ ఎం. అశోక్, కళాశాల ప్రిన్సిపాల్ జాధవ్ గణేష్, అధ్యాపకులు పాల్గొన్నారు.