ప్రముఖ చిత్రకారిణి, చిత్రకళా చరిత్రకారిణి, రచయిత్రి శ్రీమతి కోయలి ముఖర్జీ ఘోష్ రాసిన పుస్తకం ‘వండర్‌ఫుల్ కాలిగ్రఫీ ఆఫ్ పూసపాటి పరమేశ్వరరాజు’ ఇటీవల విడుదలయింది. పరమేశ్వరరాజు ఒక విలక్షణ చిత్రకారుడు. ఇంతకు ముందెన్నడూ లేని ఒక చిత్రకళారీతిని సొంతంగా నాలుగు దశాబ్దాల క్రితం రూపొందించి అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఆయన తన కళారీతిని ‘పిక్టోరియల్ కాలిగ్రఫీ’ అని చెబుతారు. కాలిగ్రఫీ అంటే అక్షరాలను అందంగా రాయడం. ఇది సాధారణంగా ఇస్లాం సంప్రదాయంలో కనిపిస్తుంది. ఎందువల్లనంటే ఇస్లాంలో వ్యక్తులు, ప్రవక్తల వాస్తవిక చిత్రాలు నిషిద్ధం. అందుచేత ఆ సందేశాలను అందమైన అక్షరాల రూపంలో వారు చిత్రిస్తారు. ఇస్లాం కాలిగ్రఫీలో పర్షియన్, ఉర్దూ లాంటి భాషాక్షరాలు ఉంటాయి. వాస్తవిక చిత్రాలకు బదులుగా వారు అలాంటి చిత్రకళను అనుసరిస్తున్నారు. కాని పరమేశ్వరరాజు చిత్రకళ దీనికి పూర్తి భిన్నమైనది. హిందూ సంప్రదాయంలో ఎందరు దేవుళ్ల చిత్రాలనయినా సంప్రదాయాలకు, ఊహలకు అనుగుణంగా చిత్రించుకోవచ్చు. కాని పరమేశ్వరరాజు పూర్తి విలక్షణంగా ఆలోచించి అక్షరాలనే అందమైన చిత్రాలుగా మలచడానికి పూనుకున్నారు. దీనికి ఆయన దేవనాగరి లిపిని ఎంచుకున్నారు. తొలుత కాలిగ్రఫీలో శిక్షణ పొందిన పరమేశ్వరరాజులో దేవనాగరి అక్షరాలను చిత్రాలుగా ఎందుకు తీర్చిదిద్దకూడదు అనే భావన ఉదయించింది. ఈ కృషిలో ఆయన తొలుత ఆరంభించింది ‘ఓం’తో. ఆయన ఆ అక్షరాన్ని తీర్చిదిద్దిన తీరు ప్రముఖ చిత్రకారుడు, చిత్రకళా సేకరణకర్త పద్మశ్రీ జగదీష్ మిట్టల్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన అప్పుడే ఈ చిత్రకారుడు తన మార్గంలో ఎంతో పురోగతి సాధించగలరని వూహించారు. ఆయన వూహించినట్లుగానే పరమేశ్వరరాజు అద్భుతమైన స్థాయికి చేరుకున్నారు.
పరమేశ్వరరాజు తన విలక్షణమైన చిత్రకళకు ఒక విశిష్టమైన రేఖా విన్యాసాన్ని పెంపొందించారు. దాని కోసం కాలిగ్రఫీ నిబ్స్‌నే వివిధ సైజుల్లో ఆయన వినియోగిస్తారు. ప్రతి రేఖ తొలుత సన్నగా మొదలవుతుంది, ఆ తర్వాత మందంగా ఉంటుంది, చివరికి సన్నగా ముగుస్తుంది. అలాంటి రేఖను పుట్టుక, జీవితం, చావుకు ప్రతీకగా కూడ తాను ఎంచుకున్నానని తాత్విక ధోరణితో ఆయన చెబుతారు. అలాంటి రేఖల సమ్మేళనంతోనే ఆయన చిత్రాలన్నీ రూపుదిద్దుకుంటాయి. ఆ రేఖావిన్యాసంలో ఒక రిథమ్ ఉంటుంది. అందుచేతనే ఆయన ప్రతిచిత్రం ప్రేక్షకుని ఇట్టే ఆకట్టుకుంటుంది. పరమేశ్వరరాజు చిత్రాలన్నీ దాదాపు ఎరుపు రంగులోనే ఉంటాయి. ఆ రంగును శక్తికి ప్రతిరూపంగా ఎంచుకున్నానని ఆయన అంటారు.
ఆయన అత్యధిక చిత్రాలు పౌరాణిక ఇతివృత్తాలకు సంబంధించినవే. దాని కోసం అపారంగా అధ్యయనం చేశారు. ఆయన డ్రాయింగ్ రూం కం స్టూడియోకు గోడలు కనిపించవు. సీలింగు వరకు పుస్తకాల ర్యాకులే ఉంటాయి. వాటిలో ఆర్ట్‌కు సంబంధించినవే కాకుండా వర్తమాన అంశాలపై ప్రముఖుల పుస్తకాలు కూడ దర్శనమిస్తాయి. ఇంతటి అధ్యయనం ఉండటం మూలంగానే ఆయన తన చిత్రాలను అతి తక్కువ రేఖలతో తీర్చిదిద్దగలుగుతున్నారు. తొలి రోజుల్లో ఆయన చిత్రాలలో రేఖల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ తర్వాత్తర్వాత క్రమంగా రేఖలు సంఖ్య బాగా తగ్గిపోయి పూర్తి మినిమలిస్టు శైలిని సంతరించుకున్నాయి. అంటే ఆ ఇతివృత్తంలోని సారాంశాన్ని మాత్రమే చిత్రంలో చూపించాలి. దాని ద్వారానే ప్రేక్షకునికి ఆ చిత్రాన్ని స్ఫురింపచేయాలి. ఆయన తన రామాయణ సీరీస్‌లో రాముడ్ని అడవులకు పంపమని కోరాల్సిందిగా కైకకు మంధర బోధ చేస్తున్న దృశ్యంలో మంధర చిత్రాన్ని ఒకే ఒక్క రేఖతో గీస్తారు. అలాగే హనుమాన్ చిత్రాలు కూడ. పరమేశ్వరరాజు పిక్టోరియల్ కాలిగ్రఫీ చిత్రాలకు పరాకాష్టగా ఒక చిత్రాన్ని చెప్పుకోవాలి. ఒకే చిత్రంలో మొత్తం దశావతారాలను చూపించి ఆయన తన అద్భుత కళా కౌశలాన్ని ప్రదర్శించారు. అది అనితర సాధ్యం. ఆయన ఒక్క హిందూ దేవతల చిత్రాలే కాదు, ఇతర మతాల చిత్రాలు కూడ తనదైన శైలిలో చిత్రించారు. ఉదాహరణకు జీసస్ క్రీస్తు సీరీస్, ఇస్లామిక్ కాలిగ్రఫిక్ సీరీస్ కూడ ఆయన తీసుకొచ్చారు. అంతే కాదు, ఆయన సంప్రదాయాన్ని అధ్యయనం చేసి తన శైలిని రూపొందించుకున్నానని, ఎవరైనా గతాన్ని అధ్యయనం చెయ్యాలని, అక్కడితో ఆగకుండా స్వతంత్ర శైలిలో, సృజనాత్మకతతో ఆధునికను జోడించాలని చెబుతారు. అలాంటి కంటెంపరరీ ధోరణి ఆయన చిత్రాలలో మనకు కనిపిస్తుంది. అంతేకాదు, ప్రముఖులు మరణించినపుడు వారికి తనదైన రేఖాచిత్రాలతో నివాళులర్పిస్తుంటారు. ఇటీవల కామ్రేడ్ సీతారాం ఏచూరి చనిపోయినపుడు, అంతకు ముందు గద్దర్ చనిపోయినపుడు వేసిన చిత్రాలే దీనికి నిదర్శనం.
నేరుగా పుస్తకం విషయానికి వస్తే, శ్రీమతి కోయలి ముఖర్జీ ఘోష్ గత మూడు దశాబ్దాలుగా పరమేశ్వరరాజు చిత్రకళను దగ్గర నుండి పరిశీలిస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి ఈ పుస్తక రచన కోసం గత ఐదేళ్ళుగా ఒక పరిశోధనగానే కృషి చేశారు. ఆమె పరమేశ్వరరాజు చిత్ర కళను ‘ఓం’ తో మొదలు పెట్టి అది అభివృద్ధి చెందిన క్రమంలో మనకు వివరిస్తారు. ఒక్కో అధ్యాయానికి ఒక ప్రత్యేక వివరణతో పాటు, ఉదాహరణగా ఇచ్చిన ప్రతి చిత్రాన్ని కూలంకషంగా విశ్లేషిస్తారు. ఈ విశ్లేషణలో చిత్రకళలోను, చిత్రకళా చరిత్రలోను ఆమెకున్న లోతైన పరిజ్ఞానం మనకు అవగతమవుతుంది. ఆమె శాంతినికేతన్‌లో బిఎఫ్‌ఏ, కోల్‌కతా రవీంద్ర భారతి విశ్వవిద్యాలయంలో పిజి చేశారు. పిజిలో ఆమె గోల్డ్‌మెడలిస్ట్. నాలుగు వందల పేజీలకు పైగా ఉన్న ఈ పుస్తకంలో వేలాదిగా గీసిన పరమేశ్వర రాజు చిత్రాలలో ఎంపిక చేసిన నాలుగు వందల వరకు చిత్రాలు, వాటి వివరణ ఉంటాయి. ఇది అత్యంత నాణ్యమైన పేపరుతో, అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దిన పుస్తకం. దీన్ని డిజైన్ చేసింది కూడ స్వయంగా డిజైనర్ అయిన పరమేశ్వరరాజే. ఉన్నత ప్రమాణాలతో ప్రగతి ప్రింటర్స్ దీన్ని ముద్రించారు. దీని బరువే నాలుగున్నర కేజీలు ఉందంటే పుస్తకం పరిమాణం, నాణ్యత అర్ధం చేసుకోవచ్చు.
ఇది పరమేశ్వరరాజు చిత్రకళపై మొదటి పుస్తకం మాత్రమే. ఇదే సీరీస్‌లో మరో రెండు వాల్యూములు వెలువడతాయి. వాటి కోసం ఎదురు చూస్తుందాం.
– గుడిపూడి విజయరావు