పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దీని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్ కమిషన్ ఆన్ ద ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేల్చింది.
‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు ఖాయం’ అని అక్టోబర్17వ తేదీ విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటు చేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది. ‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’ అని జోస్యం చెప్పింది.
ఏమిటి జలచక్రం?
జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్షిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారి తీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది.
గతి తప్పితే అంతే…
జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది.
– కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.
– దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేల చూపులు చూస్తున్నాయి. భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి.
– నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.
హరిత జలం అతి కీలకం
చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటిని బ్లూ వాటర్ అంటారు. మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక ఆభివర్ణించింది. ‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన్ ఉద్గారాలను చాలా వరకు శోషించుకునేది ఈ హరితజలమే’ అని తేల్చింది. కానీ ‘ఏ దేశంలో చూసిన చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికి పెరుగుతోంది’ అని నివేదిక హెచ్చరించింది.