కథా చిత్రాల బాల వికాసకారుడు ‘రంగపురి’

కథా చిత్రాల బాల వికాసకారుడు 'రంగపురి'‘పెద్దలైన వారు పెడదారుల నడువ/ బాల భవితలెట్లు బాగుపడును/ ఆవు చేను మేయననుసరించును దూడ / చరిత చెప్నిట్లు సామెతొకటి’ అన్న ఈ చక్కని పద్యాన్ని రాసింది ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లోని కందుకూరుకు చెందిన రంగపురి కృష్ణార్జునరావు. కృష్ణార్జునరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, కవి, రచయిత, చిత్రకారుడు, భాషా క్రీడల రూపకర్త, యూట్యూబర్‌. 17 జులై, 1971 న జన్మించారు ఈయన. శ్రీమతి రంగపురి సుశీల – శ్రీ కోటిరామమూర్తి వీరి అమ్మానాన్నలు. వీరి తాత రంగపురి రాఘవదాసు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు, ఆనాటి చనుబండ క్యాంపుకు ఆయన ఇన్‌చార్జిగా వున్నారు. ఈయన ప్రస్తుతం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లోని దమ్మపేట మండలం, నాగులపల్లిలో తెలుగు టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.
స్వతహాగా చిత్రకారుడైన కృష్ణార్జునరావు తాను బోధించే ప్రతి పాఠానికి సందర్భానుసారంగా చక్కని రేఖా చిత్రాలను గీసి పాఠాన్ని బోధిస్తారు. భాషా బోధకునిగా, రిసోర్స్‌ పర్సన్‌గా అనేక శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నిర్వహించే కృష్ణార్జునరావు ‘ఓహో’ అనే భాషాక్రీడను రూపొందిచారు. ఇప్పటికి పదిహేను ప్రదర్శనలు ఇచ్చారు. ‘బోధనోపకరణాలు’ (టి.ఎల్‌ఎం) తయారీలోనూ వైవిధ్యాన్ని చూపుతారీయన. ఈయన రూపొందించిన బోధనోపకరణాలు పలు బహుమతులను అందుకోవడం విశేషం. యూట్యూబ్‌లో ఇవాళ్ల మనకు తారసపడని అంశమంటూ లేదు. కృష్ణార్జునరావు తాను బోధించే పాఠాలను వీడియోలుగా చేయడంలో దిట్ట. ఇవేకాక సమాజానికి ఉపయోగపడే అనేక అంశాలు, విషయాలు ఈయన వీడియోల్లో ఉంటాయి.
బాల సాహితీవేత్తగా తన కూతురు శ్రీచరితకు తెలుగు సామెతలను చెప్పేందుకు ‘చరితార్థ శతకం’ రాశారు ఈయన. ‘చరిత చెప్పినట్లు సామెతొకటి’ దీని పద్య మకుటం. ఇందులో ప్రతి పద్యంలో ఒక చక్కని తెలుగు సామెతను కూర్చి చెప్పారు. శ్రీచరిత కోసం రాసినా ఇది ఇవాళ్ళ తెలుగు పిల్లలందరిది కూడా. ‘బాల్యమందు యెండు బడి ముఖమెరుగడో/ వాడు చదవలేడు వయసు పెరుగ/ వంగకున్న మొక్క వంగునా మ్రానైన/ చరిత చెప్పినట్లు సామెతొకటి!’ అందులోని పద్యమే. తనకు నచ్చిన ఫొటో తీసి, దానికి కూడా ఒప్పే పద్యం రాయడం మరో క్రీడ. దీనినాయన ‘చిత్రాట వెలదులు’గా రాశారు. అటువంటివే ఈ రెండు ఆటవెలది పద్యాలు… ‘స్వచ్ఛ పాఠశాల సాకారమునుజేయ/ చెత్తనూడ్చిజేయ చిన్నపోగు/ బడతలంత కలసి బుద్దిగా కసువును/ గోనెసంచికెత్తి గొయ్యినింపె’, ‘జన్మదినము నాడు జల్సాలు చేసుకో విందునివ్వు యందు చిందులేయు/ వస్తు వాహనములు మస్తుగా కొనుగాని/ మొక్కయొకటి నాటి మురవగలవు’. పిల్లల కోసం రెండు ఏకాంకిలను రాశారు. అవి ‘మా ఇంటి వంట’, ‘ప్రస్టేజ్‌’లు.
ఉపాధ్యాయునిగా తన అనుభవాలు, బడి పిల్లలకు తాను బోధించాలనుకున్నవి, చెప్పాలనుకున్నవి, తానే చూసినవి, విన్నవి అనేకం తన రచనల్లో చేర్చారు కృష్ణార్జునరావు. ఇప్పటికి ఈయన ఉపాధ్యాయ జీవితానుభవం ఇరవై ఎనమిదేండ్లు. ఇరవై అయిదు సంవత్సరాల ఉద్యోగపూర్తి సమయంలో ‘రజతోత్సవం’ పేరుతో ఇరవై అయిదు కథలను రాసి చక్కని పుస్తకంగా తెచ్చారు. ఇవన్నీ విద్యార్థులతో ఆయనకున్న అనుబంధాలకు అక్షర చిహ్నాలు. సంఘటనలు సన్నివేశాలన్నీ నిజ జీవితంలోంచి తీసుకోవడం, వాటిని కథలు చేయడం కృష్ణార్జునరావుకు బాగా తెలిసిన విద్య. తొలికథ ‘కిట్టూ పదిపట్టు’ కథలో అనేక విషయాలు మనకు విస్మయం కలిగించడంతో పాటు పిల్లల మనసుపై చెడు విషయాల ప్రభావం పెద్దయ్యాక ఎంత బలంగా ఉంటాయో చెబుతుంది. మంచి కథ, అయితే నాన్న జేబులోంచి డబ్బులు పోవడం వంటి విషయాలు పెద్దలకు సంబంధించినవి. ‘అశ్రద్ద’ కథ ఉపాధ్యాయుడుగా తాను నమ్మిన ఆదర్శాలను, సిద్ధాంతాలను, పనిపట్ల చూపిస్తున్న శ్రద్ధను ఇతరులు కూడా చూపించాలని భావించే ఒక టీచర్‌ ఆలోచనల కథ. అందరం అలా ఉంటే బాగుంటుంది. ఉండాలని మనమూ కోరుకుందాం. ‘ఊహలు’ కథ కూడా ఇటువంటిదే. కేవలం తాను కూర్చున్న దగ్గర పగటి కలలు కంటూ పనిచేయని సోమరి సతీష్‌కు సంబంధించిన కథ. ‘అదిరిన అల్లుడు’ కథచక్కని హాస్యాన్ని పండించిన కథ. ఇందులో రచయిత హాస్య చతురతతోపాటు పాత్రలను చక్కగా తీర్చిదిద్దడం చూడవచ్చు. ఇటువంటిదే ‘అల్లుడా మజాకా!’ అనే మరో కథ. గొప్పలకు పోయి డంబాలు పలికి బోల్తాపడ్డ అల్లుని కథ యిది. ఇందులోని విజరు తనకు జ్యోతిషం తెలుసునని చెప్పి అత్తగారింట ఎలా ఇబ్బందుల పాలయ్యాడో చూడొచ్చు. ‘ఎవరు గొప్ప’ ఫాంటసీ కథ పిల్లలకు బాగా నచ్చుతుంది. ‘నోటూ నీకే నా ఓటు’ మానవ సంబంధాలను చూపించే కథ. ఈ ఇరవై అయిదు కథల్లో చిన్న పిల్లల నుండి యువతరం వరకు పనికొచ్చే కథలున్నాయి. వీటిని ఆయా వయసుల వారిగా వేస్తే ఇంకా బాగుండేది. కవి, రచయిత, చిత్రకారుడు, భాషోపాధ్యాయుడు, టీచర్‌, ట్రైనర్‌ రంగపురి కృష్ణార్జునరావు అచ్చంగా అన్ని కళల సమాహారం. ఇందులోని కొన్ని కథలు నవ్విస్తే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి, ఇంకొన్ని సరదాగా చదువుకునేందుకు బాగుంటాయి. కొన్ని మనవ సంబంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలకు అచ్చువోసినట్లుంటాయి. డా.అభినయ అన్నట్టు ఆబాల గోపాలాన్ని అలరించే ‘గోపాల కిరీటి.’… జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548