కొమురమ్మకు స్పీకర్‌ రూ.లక్ష ఆర్థిక సహాయం

– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సభాపతి ప్రసాద్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బలగం సినిమా ఫేమ్‌ కొమురమ్మకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అందించారు. కొద్ది రోజుల కిందట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తండ్రి పొన్నం సత్తయ్య స్మారక అవార్డు సభలో ఆర్థిక సహాయం చేస్తానని కొమురమ్మ, మొగిలయ్య దంపతులకు స్పీకర్‌ హామీనిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోదరుడు పొన్నం రవిచంద్రతో కలిసి కొమురమ్మకు రూ. లక్ష చెక్కును అందజేశారు. తనకి పింఛన్‌ ఇప్పించాలని కొమురమ్మ స్పీకర్‌ను వేడుకున్నది. మంత్రితో మాట్లాడి ఇప్పించేందుకు కృషి చేస్తానని స్పీకర్‌ హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. లక్ష చెక్కును అందజేసిన స్పీకర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. తన భర్త మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించేందుకు డబ్బులను ఉపయోగిస్తానని కొమురమ్మ తెలిపారు.