నవతెలంగాణ-చిలుకూరు
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని కవితా జూనియర్ కళాశాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం సబ్జాపురం గ్రామానికి చెందిన భీమన శంకర్, మంగ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు హరీశ్, చిన్న కొడుకు వినరు. వినరు చిలుకూరు మండలకేంద్రంలోని కవితా కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లి తిరిగి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో తన మేనమామ లింగం నాగయ్యతో కలిసి బైకు మీద కాలేజీకి వచ్చాడు. కవితా కాలేజీ యజమాన్యాన్ని విద్యార్థి మేనమామ కలవగా.. వినరు చదువులో కొంచెం వీక్‌గా ఉన్నాడని వారు తెలిపారు. దాంతో విద్యార్థితో మేనమామ మంచిగా చదువుకో అని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే గదిలోకి వెళ్లిన వినరు.. ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకొని గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.