ఏది
ఆ చక్రాల కుర్చేది
ఐదేండ్ల సంది – అమరుడయ్యే దాక
గొప్ప మానవతా పరిమళాన్ని
తన ఒడిలో మోసిన ఆ అమ్మేది?
అడవికి మనసిచ్చి ఆకులకు మాటలు నేర్పి
హక్కులనడిగే సాయుధులను చేసిన
ఆ పచ్చని గుండెను నులివెచ్చగా కాసుకున్న ఆ తల్లేది ?
స్వార్థపు పాకర మీద
కాలేసి జారిపోతున్న లోకానికి చేయిచ్చి
నిస్వార్ధంగా నిలబెట్టాలనుకున్న నెట్టాడికి
నిత్యం తోడునీడగున్న ఆ భూమేది ?
కండ్లు మూసుకొని
కదిలిపోతున్న చీకటి సమాజంలో
అక్షరాల అగ్గి రవ్వలను రాజేసి
తూరుపు తెరమీద
అభ్యుదయాన్ని ఆవిష్కరించిన వెలుగు పిట్టను
ఎగరేసిన ఆ ఆకాశమేది ?
మోదుగు పూలకు
వసంతాన్ని పరిచయం చేస్తున్న
ఆ ఎర్రని ఏరును మాయం చేస్తే
కుమిలిపోతు ఏడుస్తున్న ఆ పూల ఛత్రేది ?
విశ్వవిద్యాలయాన
అవమానాలు, ఆకలి పాఠాలను చెప్తుంటే….
ఎరుపెక్కిన సాయిబాబుని జన చక్రాలేవి ?
నిజం మాట్లాడినందుకే నిందలేసి
పదేళ్లపాటు అష్ట కష్టాలు పెట్టిన
బాపిష్టి ఫాసిస్టు పాలనకు సాక్ష్యమేది ?
ఏది
మెరుపయ్యిందా, మేఘమయ్యిందా,
సాదుకున్న బిడ్డడి ఆశయాలను వాగ్దానం చేస్తుందా ?
ఏది
ఆ చక్రాల కుర్చేది?
కండ్లార చూసుకుంటా, మనసారా సలాం చేస్తా
విముక్తి మార్గమేందో తెలుకుంటా
(ప్రొఫెసర్ సాయిబాబా స్మతిలో…)
– చిక్కొండ్ర రవి, 9502378992