– మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నోరు మూసీ నది కన్నా అధ్వాన్నంగా తయారైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ వదిలేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తిచేసిందని గుర్తుచేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి అనుచరులు సబ్‌స్టేషన్ పరికరాలను అమ్ముకున్నారని ఆరోపించారు. నల్లగొండకు మెడికల్ కాలేజీ, బత్తాయి మార్కెట్, ఐటీ హబ్‌లను ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. పది నెలల కాలంలో రెండు కిలోమీటర్ల రోడ్డును కోమటిరెడ్డి వేయించలేకపోయారని విమర్శించారు. సాగర్‌నీళ్లు ఖమ్మం పోతున్నాయి గానీ నల్లగొండకు రావట్లేదన్నారు. నల్లగొండ జిల్లాలో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మంత్రులు అసమర్ధులుగా మారారనీ, కోమటిరెడ్డి మంత్రి పదవిని కాపాడుకోవడానికి రేవంత్‌రెడ్డి భజన చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా అణిచివేయాలనే అక్కసుతో తమ కంపెనీలపై రాష్ట్ర, కేంద్ర విజిలెన్స్‌లకు కోమటిరెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. కమీషన్లు వసూలు చేసే సంస్కృతి కోమటిరెడ్డిదని ఆరోపించారు. రూ.1150 కోట్లతో నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేశానన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేసి రా.. ఎవరు గెలుస్తారో చూద్దాం అని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ..సీఎం, మంత్రులు సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వస్తే తిరగబడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.