తప్పెవరిది? శిక్షెవరికి?

Who's wrong? Who is the punishment?భవిష్యనిధి, గ్రాట్యుటీ లాగా పెన్షన్‌ కూడా మూడో బెనిఫిట్‌గా ఇవ్వాలని భారత కార్మికులు కోరుతూ వస్తున్నారు. అది పక్కన పెట్టి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం ఈపీఎస్‌ను 1995లో ముందుకు తెచ్చారు పాలకులు.చట్టంలో పేరా 11(3) చేర్చి హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్‌ను ముందుకు తెచ్చి సీలింగ్‌ జీతంపైన కాకుండా పూర్తి జీతంపైన పెన్షన్‌ ఫండ్‌కు నిధులు చెల్లిస్తే, చివరి 12 నెలల సగటు జీతం ఆధారంగా పెన్షన్‌ చెల్లిస్తామని 1996లో సవరణ చేశారు.మూడో బెనిఫిట్‌గా పెన్షన్‌ ఇవ్వరని అర్థం చేసుకొని, పూర్తి జీతంపై పెన్షన్‌ నిధికి 8.33శాతం నిధులను జమ చేసైనా, ఉద్యోగ విరమణ అనంతరం కొంత సామాజిక భద్రత వస్తుందని భావించిన కార్మికులు/ఉద్యోగులు చట్టంలోని 11(3) ప్రకారం హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్‌ ఇచ్చారు. దేశం మొత్తంపైన లక్షల మంది ఇచ్చినట్లే ఉమ్మడి ఏపీఎస్‌ఆర్టీసిలో కూడా సుమారు 20వేల మంది హయ్యర్‌ పెన్షన్‌ ఇచ్చారు.1996 నుండి 2014 వరకు (వారు స్కీంలో చేరిన రోజు నుండి) వారి జీతాల నుండి సీలింగ్‌ జీతంపైన కాకుండా పూర్తి జీతంపైన పెన్షన్‌ నిధి కోసం ఆర్టీసి పి.ఎఫ్‌ ట్రస్ట్‌ రికవరీ చేసి, ఆ రికవరీలను ఈపిఎఫ్‌ఓ పెన్షన్‌ నిధికి రెగ్యులర్‌గా జమ చేశారు.
అకస్మాత్తుగా ఆర్టీసి పిఎఫ్‌ ట్రస్ట్‌ నుండి ఒక లేఖను (లేఖ నెం:Dy. SUP (P) EPS/H/PEN (Raj) 480(2)(20)/14-15, తేది. 15అక్టోబర్‌ 2014ను) విడుదల చేస్తూ, ఇప్పటి వరకు హయ్యర్‌ పెన్షన్‌ కోసం చెల్లింపులు చేస్తూ వస్తున్న 16,307 మంది హయ్యర్‌ పెన్షన్‌ను ఈపిఎఫ్‌ఓ వారు తిరస్కరించాలరని, అందుకని 16,307 మంది వద్ద నుండి పెన్షన్‌ ఫండ్‌ కోసం రికవరీ చేసిన డబ్బులలో నుండి సాధారణ పెన్షన్‌ కోసం చెల్లించాల్సినవి పోను మిగతా డబ్బులకు వారి, వారి వ్యక్తిగత ఖాతాలలో వడ్డీతో సహా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, 20సెప్టెంబర్‌2014 నాటి పి.ఎఫ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ మీటింగ్‌ మినిట్స్‌లో నిర్ణయించారు (మినిట్స్‌ లేఖ నెం. AM(F)/471 (2)/2014-15 – PFT తేది.20 సెప్టెంబర్‌ 2014). 1996-2014 మధ్య పదేండ్ల కాలం హయ్యర్‌ పెన్షన్‌ కోసం ఈపిఎఫ్‌ఓ అనుమతి లేకుం డానే, ఆర్టీసి పిఎఫ్‌ ట్రస్ట్‌ రికవరీ చేసిందా? నిధులు తన దగ్గర జమ చేసుకొన్న ఈపిఎఫ్‌ఓ వారు పదేండ్ల తర్వాత ఏ ప్రాతిపదికన రిజెక్టు చేసినట్లు? అందుకు కారణమేమిటి? అనేది నేటికి చిదంబర రహస్యమే.
ఉమ్మడి ఆర్టీసిలో 16,307 మంది (నేడు ఏపీఎస్‌ఆర్టీసి – 8934; టీజీఎస్‌ఆర్టీసి-7373 మంది)కి పూర్తి సమాచారం కూడా ఇవ్వక పోవడం దారుణం. 1996లో ఈపిఎస్‌ చట్టంలో తీసుకొచ్చిన సవరణ ద్వారా అవకాశం కల్పిస్తేనే కదా ఇంతమంది హయ్యర్‌ పెన్షన్‌ కోసం అప్లై చేసుకొన్నది. చట్టానికి విరుద్ధంగా ఎందుకు తిరస్కరించారు? అలా తిరస్కరిస్తే పి.ఎఫ్‌ ట్రస్ట్‌ ఏం చేసింది? ఆర్టీసి పిఎఫ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌గా వున్న గుర్తింపు కార్మిక సంఘం ఎందుకు ఆందోళనలకు పిలుపివ్వలేదు? వారందరికి న్యాయం జరిగేలా ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఈ ప్రశ్నలకు ఎక్కడా జవాబులు లేవు. 20 సెప్టెంబర్‌ 2014 నాడు జరిగిన ఏపీఎస్‌ఆర్టీసి బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ మీటింగ్‌లో పాల్గొన్నది ఆనాడు గుర్తింపులో ఉన్న ఎంప్లాయీస్‌ యూనియన్‌. 16,307 మంది నుండి చేసిన రికవరీలలో నుండి సాధారణ పెన్షన్‌ కోసం చెల్లింపులు పోను మిగతా డబ్బులు నెల రోజులలోపు వడ్డీతో సహా తిరిగి కార్మికుల అకౌంట్లలోకి జమ చేపిస్తామని రాసుకున్న మినిట్స్‌ అమలు కోసం 2014-2024 మధ్య ఆ సంఘం చేసిన కృషి ఏమిటి? 2016 లో జరిగిన ఎన్నికలలో గెలిచిన టిఎంయు నాయకులు ఆ తర్వాత బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌గా వున్నారు. మరి 2016 నుండి 2019 వరకు 16,307 మందికి ఈపిఎఫ్‌ఓ నుండి రావలసిన డబ్బులను తిరిగి ఇప్పించేందుకు చేసిన కృషి ఏమిటి? బాధ్యత కలిగిన కార్మిక సంఘాలు ఈ సమాచారం 16,307 మందికి తెలియజేసేందుకు చేసిన ప్రయత్నం ఏమిటి? ఇవన్నీ కార్మికుల మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్నలు.
మరి యాజమాన్యం చేసిన ప్రయత్నం ఏమిటి? సింపుల్‌గా మీ హయ్యర్‌ పెన్షన్‌ తిరస్కరించారని ఒక లేఖ పంపి చేతులు దులుపుకున్నది. వారి వద్ద నుండి అదనంగా రికవరీ చేసిన మొత్తాలు తిరిగి కార్మికులకు చెల్లించేలా కృషి చేయాల్సిన బాధ్యత పి.ఎఫ్‌ ట్రస్ట్‌దేగా. మరి 2014 నుండి 2024 వరకు తెలంగాణ ఆర్టీసిలో వున్న 7373మంది కోసం ఈపీఎఫ్‌ఓ/ఆర్‌పీఎఫ్‌సికి రాసిన లేఖలు ఎన్ని? ఒక్కో కార్మికునికి తిరిగి రావలసిన అసలెంత? ఆయా సంవత్సరాలలో వున్న వడ్డీ రేట్లను అమలు చేస్తే వచ్చే మొత్తాలు ఎంత? ఆర్టీసీ పి.ఎఫ్‌ ట్రస్ట్‌ నేటి వరకైనా ఈ లెక్కలు చేసిందా? చేయకపోతే ఎందుకు చేయలేదు? ఆ సమాచారం కేవలం ఆర్టీసి ట్రస్ట్‌ వద్ద మాత్రమే వుంటుంది. ఎందుకంటే ఆర్టీసి ‘మినహాయించబడ్డ ట్రస్ట్‌’గా నడుస్తున్నది. పదేండ్ల కాలంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించే సమయం లేదా?
కార్మికుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్న ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకత్వం 2021 సం|| నుండి ఈ సమస్యను వెలుగులోకి తెచ్చి, పరిష్కారానికి ప్రయత్నిస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హయ్యర్‌ పెన్షన్‌ సమస్య మరోసారి చర్చకు వస్తున్నది. అందులో వస్తున్న సమస్యలతో పాటు ఈ సమస్యపై పోరాడుతున్నది. అయినా ఇక్కడ కూడా 16,307 మందికి అన్యాయం జరుగుతున్నది. హయ్యర్‌ పెన్షన్‌ కోసం డిమాండు నోటీసులు జారీ చేసేటప్పుడు, అప్పటివరకు పెన్షన్‌ఫండ్‌కు జమచేసిన నిధిని మినహాయించి, మిగిలిన డబ్బులకు మాత్రమే డిమాండ్‌ నోటీసులు పంపాలని ఈపీఎఫ్‌ఓ నుండి వున్న ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, వీరికి కూడా పూర్తి కాలానికి (1996-2023) మధ్య కాలానికి సంబంధించి చెల్లించాల్సిన మొత్తాలపై డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. ఫలితంగా ఒకే కాలానికి వారు రెండుసార్లు అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. ఇది అత్యంత దుర్మార్గమైనది. ఆర్‌పిఎఫ్‌సికి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులతో 7అక్టోబర్‌ 2024న జరిగిన మీటింగ్‌లో దీనినే ప్రధాన సమస్యగా చర్చించడం జరిగింది.వీరికి రావలసిన డబ్బులు తిరిగి చెల్లించాలంటే, అందుకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖలను ఆర్టీసి పి.ఎఫ్‌ ట్రస్ట్‌ నుండి ఆర్‌పిఎఫ్‌సికి పంపించాలి. ఇప్పటివరకు ఆ పని జరగలేదు. అందుకని 18అక్టోబర్‌ 2024న ఆర్టీసి చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌కు ఎస్‌డబ్ల్యూఎఫ్‌గా వినతిపత్రం ఇచ్చింది. ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిస్తున్నాము.రికవరీలను జమ చేసుకొని, పదేండ్ల తర్వాత తిరస్కరించింది ఈపీఎఫ్‌ఓ. నెల రోజులలోపు ఆ డబ్బులు తిరిగి ఇప్పిస్తామని అంగీకరించింది ఆర్టీసి పిఎఫ్‌ ట్రస్ట్‌. కానీ ఏ తప్పు చేయకుండానే ప్రభుత్వాన్ని నమ్మి రూ.220 కోట్ల మేర నష్టపోతున్నది మాత్రం కార్మికులే. తప్పు ప్రభుత్వం, యాజమాన్యది అయితే, శిక్ష మాత్రం కార్మికులకా? ఆలోచించాలి.
అలాగే,అనేక ఆందోళనల తర్వాత పొందిన హయ్యర్‌ పెన్షన్‌ హక్కును కేంద్రం తూట్లుపొ డుస్తూ, దామషా పద్ధతి పేరుతో అర్హత కలిగిన పెన్షన్‌లో నలభైశాతం కోత పెడుతున్నది. ఇప్పటికే హయ్యర్‌ పెన్షన్‌ పొందుతున్న వేలాది మంది ప్రయోజనానికి కూడా త్వరలో ప్రమాదం వస్తుంది. అందుకని మొత్తం పెన్షన్‌, పీఎఫ్‌ సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేయాల్సిన అవసరముంది. దానికి కార్మికులంతా సిద్ధమవ్వాలి.
వి.యస్‌. రావు
9490098890