కోచింగ్‌ సెంటర్లలో ఒకే రకమైన ప్రమాణాలు వుండాలి : సుప్రీం

న్యూఢిల్లీ : కోచింగ్‌ సెంటర్లలో చదివే విద్యార్ధుల భద్రత, రక్షణలకు హామీ కల్పించేందుకు వీలుగా సాధ్యమైనంతవరకు ఒకే రకమైన ప్రమాణాలు వుండాలని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దేశ రాజధానిలో జులై 27న ఒకక భవనం బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో ఆ భవనంలోని కోచింగ్‌ సెంటర్‌లో చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు మరణించారు. అందుకు సంబంధించిన పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ విచారించి పై వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి సంఘటనలప్పుడు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాల గురించి ఈ విషయంలో అమికస్‌క్యూరీగా వున్న సిద్ధార్ధ దావె సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు రక్షణ, ఫీజుల క్రమబద్ధీకరణ, విద్యార్ధులు, తరగతి గదుల నిష్పత్తి, వైద్య సదుపాయాలు, మానసిక ఆరోగ్యం, కౌన్సెలింగ్‌ వంటి అంశాలపై కూడా దృష్టి సారించాల్సి వుందని కోర్టుకు సూచించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను కూడా కక్షిదారులుగా చేర్చాలని సూచించారు. ఏడు రాష్ట్రాల్లో కోచింగ్‌ సంస్థలకు సంబంధించిన చట్టాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దూరదృష్టితో వ్యవహరించాల్సి వుందని అమికస్‌ క్యూరీ దావె సూచించగా, ఆ పర్యవేక్షణ కూడా శాశ్వత పద్ధతిలో వుండాల్సి వుందని బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ అంశంపై ఒకే రకమైన ప్రమాణాలు పాటించాల్సిన అవసరం వుందని పేర్కొంది. కోచింగ్‌ సంస్థలకు ముఖ్యంగా దేశ రాజధాని ప్రాంతంలో వున్న వాటికి ఒక సమగ్ర విధానం రూపొందించాల్సిన ఆవశక్యతపై అమికస్‌ క్యూరీకి సూచనలు, సలహాలు అందజేయాల్సిందిగా సంబంధిత అధికారులను కోరింది. రెండు వారాల తర్వాత విచారణను వాయిదా వేసింది.