కేంద్రం హామీతో సోనమ్‌ వాంగ్‌చుక్‌దీక్ష విరమణ

– డిసెంబరు 3న చర్చలు
న్యూఢిల్లీ : లడఖ్‌ ప్రాంతానికి చెందిన పౌర సమాజ నాయకులతో చర్చలు పునరుద్ధరించేందుకు కేంద్రం హామీ ఇవ్వడంతో సామాజిక ఉద్యమ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రభృతులు సోమవారం నిరశన విరమించారు. 16రోజుల పాటు వారు తమ డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష జరిపారు. డిసెంబరు 3న హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. నాలుగు పాయింట్ల ఎజెండా నుండి తాము వెనక్కు మళ్లడం లేదని, వాటిపైనే చర్చలు జరుగుతాయని కొత్త డిమాండ్లు పెట్టలేదని, వున్న వాటిని తొలలించలేదని లడఖ్‌ బౌద్ధ సమాఖ్య అధ్యక్షుడు, లేహ్ అపెక్స్‌ బాడీ (ఎల్‌ఏబీ) కో కన్వీనర్‌ చెరింగ్‌ డోర్జే లక్రాకక్‌ చెప్పారు. కమిటీలో ఆయన కూడా వున్నారు. లేహ్, కార్గిల్‌ సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య డిసెంబరులో చర్చలు పునరుద్ధరించబడతాయని కేంద్ర హోం శాఖ జాయింట్‌ కార్యదర్శి తమకు లేఖ అందజేశారని వాంగ్‌చుక్‌ తెలిపారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మాట్లాడారు. ఈ చర్చలు జరిగేలా చూడాలన్నదే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఉభయ పక్షాలు సానుకూల ధోరణితో, సుహృధ్భావంతో చర్చలు జరపగలవని భావిస్తున్నట్లు చెప్పారు. మరోసారి దీక్షకు కూర్చునే పరిస్థితి వస్తుందని భావించడం లేదని వ్యాఖ్యానించారు. లడఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ సోనమ్‌ వాంగ్‌చుక్‌ గత నెల 1వ తేదీన లేహ్ నుండి ఢిల్లీ చలో పాదయాత్రను చేపట్టారు. పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో వారి యాత్రను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షకు అనుమతినివ్వకపోవడంతో చివరకు తాముంటున్న లడఖ్‌ భవన్‌ వద్దనే 18మందితో కలిసి నిరాహార దీక్షకు దిగారు.