– విద్యాశాఖ సంచాలకులకు టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్‌ను ఎత్తేయాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం కలిసి వినతిపత్రం సమర్పించారు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రధానోపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టారని తెలిపారు. ఇందులో స్పౌజ్ పాయింట్లను వినియోగించుకున్న ప్రధానోపాధ్యాయులకు స్పౌజ్ పనిచేస్తున్న జిల్లాలోని ఖాళీలనే ఎంపిక చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించిందని పేర్కొన్నారు. ఆ జిల్లాలోని ఖాళీలను ఆప్షన్‌గా ప్రాధాన్యత ప్రకారం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పరిశీలించిన తర్వాతే బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రధానోపాధ్యాయులు స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే కారణంతో వారినే పూర్తిగా బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేయడం సమంజసంగా లేదని పేర్కొన్నారు. జనగామ జిల్లా వడ్లకొండ జెడ్పీహెచ్‌ఎస్ జీహెచ్‌ఎం స్వర్గం ప్రకాశంను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ ఆర్జేడీ ఈ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. ఆయన సస్పెన్షన్‌ను పున:సమీక్షించి దాన్ని తొలగించాలని కోరారు.