
అడవి బిడ్డల ఉద్యమ గర్జన కొమురం భీం అని మండలంలోని హాస కొత్తూర్ నాయక పోడ్ సేవా సంఘం సభ్యులు అన్నారు. మంగళవారం మండలంలోని హాస కొత్తూర్ లో జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం సర్కార్ పై భీకరంగా పోరాడిన గొండు బెబ్బులి కొమురం భీం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకపోడు సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆదివాసులను పీడిస్తున్న నిజాం సర్కార్ కు కొమురం భీం ఎదురొడ్డి నిలబడ్డారని కొనియాడారు. గెరిల్లా తరహా పోరాటాలకు ఆదివాసులను సిద్ధం చేసి నిజాం కు కంటిమీద కునుకు లేకుండా చేశాడన్నారు. అయితే సైన్యం తూటాలకు కొమురం భీం నేలకొరిగాడని కానీ ఆయన రగిలించిన పోరాటం ప్రభుత్వంలో కదలిక తెచ్చిందన్నారు. తద్వారా అడవి బిడ్డలకు ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో నాయక పోడు సేవా సంఘం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.