నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా, రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండే ఈ పోరుబాట ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే రైతుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. ఈనెల 24న నిర్వహించే భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. జన సమీకరణ కోసం గత కొన్ని రోజుల నుండి రూరల్ లోని ఆయా గ్రామాల్లో పట్టణంలోని పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. కేటీఆర్ సభకు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్ లు ఏర్పాటు చేశారు.
సభకు ప్రజలు తరలిరావాలి
కేటీఆర్ సభకు సర్వం సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి జోగురామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. సభ ఏర్పాట్లను బుధవారం పర్యవేక్షించి.. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు గానూ చేపడుతున్న సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నేతలు విస్తృత ప్రచారం చేశారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతాంగంతో పాటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో రైతులు అదే రెపడకుండా కేటీఆర్ సారధ్యంలో పార్టీ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు ప్రజలకు భరోసా కల్పించేందుకు కేటీఆర్ చేపడుతున్న పోరుబాట సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, అన్నదాతలకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, రౌతు మనోహర్, రోకండ్ల రమేష్ ఇజ్జగిరి నారాయణ, పండ్ల శ్రీనివాస్, దమ్మ పాల్, బట్టు సతీష్, అయూబ్ పర్వీన్ పాల్గొన్నారు.