గురివిందలు

 Sampadakiyamచెప్పేవాడికి వినేవాడు లోకువ..బహుశా ఈ సామెత బీజేపీ రాష్ట్ర నేతలకు బాగా నప్పినట్టుంది. తెలంగాణ ప్రజానీకం తామేం చెప్పినా వింటారు..’ఊ’ కొడతారనే ధోరణితో వారు వ్యవహరిస్తున్నారు.ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు ఘటనలు, వాటికి సంబంధించి కేంద్ర మంత్రులు గంగవరపు కిషన్‌రెడ్డి, బండి సంజరుకుమార్‌, ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. కేంద్రంలో గత పదకొండేండ్ల నుంచి కుర్చీ మీద కూర్చున్న పార్టీ బీజేపీ.అది 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తెస్తాం, ప్రతీ ఒక్క భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పటమనే అంశాల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఈ వాస్తవాలను పక్కనబెట్టి… తగుదునమ్మా అంటూ కిషన్‌రెడ్డి, సంజరు, రాజేందర్‌లు రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రేవంత్‌ సర్కార్‌… పెద్ద కితాబులివ్వాల్సిన పనులేవీ చేయకపోయినా మాటమీద నిలబడని బీజేపీ, కాంగ్రెస్‌ హామీల అమలు గురించి మాట్లాడటం విడ్డూరమే మరి. పైగా కొన్నిచోట్ల చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు చూడటం ఆ పార్టీ నేతల అవకాశవాదానికి పరాకాష్ట.
కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి బండి సంజరు… గ్రూప్‌-1 అభ్యర్థులకు మద్దతు ప్రకటించి, నానా యాగీ చేశారు. వారిపట్ల రేవంత్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తూర్పారబట్టటమేగాక, ఆ పరీక్షను వాయిదా వేసి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది కాబట్టి, దానిపై ఎవరూ మాట్లాడకూడదు. కానీ 2014 ఎన్నికల్లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ గద్దెనెక్కిన ప్రధాని మోడీ… ఇప్పటి వరకూ 22 కోట్ల ఉద్యోగాలివ్వాలి కదా? పదకొండేండ్ల ఏలుబడిలో కొత్త ఉద్యోగాల సంగతి తర్వాత, ఉన్న కొలువులను ఊడబెరుకుతున్నది ఎవరు? రైల్వేలో 25 వేలకు పైగా ఖాళీలుంటే వాటిని భర్తీ చేయకుండా వదిలేస్తున్నది ఎవరు? పైగా స్కేల్‌ 1 నుంచి 7 వరకు (నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు) ఉన్న విశ్రాంత ఉద్యోగులతో వాటిని భర్తీ చేస్తున్నారు తప్పితే చదువుకున్న యువతీ యువకులక ఉద్యోగాలిస్తున్నారా? చివరకు సైన్యంలో ‘అగ్నివీరుల’ పేరిట కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చింది ఇదే బీజేపీ కాదా? ఐదేండ్ల కాంట్రాక్టు పేరుతో ఆ అగ్నివీరులను వాడుకునేది, కనీసం చనిపోతే అధికారిక అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా చేస్తున్నది మోడీ సర్కారే కదా? వీటన్నింటికీ బండి సంజరు సమాధానమేంటి? ఇదే సమయంలో తెలంగాణలో జీవో 29లోని తప్పొప్పుల గురించి ఆయన ప్రస్తావించటం ఒక ఎత్తయితే, ఇక్కడ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందంటూ వితండ వాదన చేయటం మరో ఎత్తు. దేశంలోని ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లను ఎత్తేసే అధికారం లేదనే విషయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజరుకు తెలియదా? అంటే కచ్చితంగా తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగానే గ్రూప్‌ అభ్యర్థులను ఆయన తప్పుదోవపట్టిస్తున్నారు. ఇది మరింత దుర్మార్గం.
ఇక గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును చేపట్టిన బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి… ఇక్కడ మాత్రం మూసీనది ప్రక్షాళన, దాని పునరుజ్జీవాన్ని వ్యతిరేకిస్తుండటం హాస్యాస్పదం. పైగా కేంద్ర ప్రభుత్వ పెద్దలే ధర్నాకు పూనుకుంటామంటూ ప్రకటించటం విడ్డూరం. మూసీ బాధితులు, నిర్వాసితుల పక్షాన నిలబడాలన్న చిత్తశుద్ధి నిజంగా ఉంటే, కేంద్రం వారి చేతిలోనే ఉంది కాబట్టి, అక్కడినుంచి చాలినన్ని నిధులిప్పించటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడాలి. తెలంగాణలో బాధ్యతగల ప్రతిపక్షంగా బీజేపీ… రేవంత్‌ సర్కారుకు నిర్మా ణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వటాన్ని ఎవ్వరూ తప్పుబట్టరు. కానీ అందుకు భిన్నంగా కాషాయ పార్టీ వ్యవహరిం చటం ప్రమాదకరం. ఇక మోడీ ఏలుబడిలో వివిధ రాష్ట్రాల్లో కొనసాగిన మత కల్లోలాలు, ఉద్రిక్తతలు, మైనారిటీలు, దళితులపై దాడులు దేశ ప్రజానీకం మొత్తానికి ఎరుకే. వాటిని మరిచి, ఇప్పుడు ఈటల రాజేందర్‌… ‘ఒక మతానికి చెందిన ఆత్మగౌరవం దెబ్బతిన్నది, సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుపుతున్నారంటూ’ వ్యాఖ్యానిం చటం దేనికి సంకేతం? తద్వారా ఆయన తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలిచారు?
బీజేపీకి చెందిన ఈ ముగ్గురు అగ్రనేతలు, వారు చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలనుబట్టి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బలపడేందుకు కమలదళం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టిందని విదితమవుతున్నది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిది మంది ఎంపీలు గెలిచిన ఆ పార్టీ… వచ్చేసారి ఎలక్షన్ల కోసం ‘ఏమైనా చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం…’ అనే రీతిలో వ్యవహరిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే రెచ్చగొట్టుడే లక్ష్యంగా, ఉద్రిక్తతలు రేపటమే ఉద్దేశంగా దాని కార్యక్రమాలుండటం ఆందోళనకరం, అభ్యంతరకరం. ఇది మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న తెలంగాణకు, హైదరాబాద్‌కు ఎంతమాత్రమూ క్షేమదాయకం కాదు. అందువల్ల ‘గురివింద తన నలుపెరగదన్నట్టు’ తామిచ్చిన హామీలు, వాగ్దానాల గురించి నోరు మెదపకుండా, ప్రజల దృష్టిని వాటిపై నుంచి మరల్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ పరివారం ఆటల్ని సాగనివ్వొద్దు. అందుకే సాయుధ పోరాట వారసులైన తెలంగాణ పౌరులారా.. తస్మాత్‌ జాగ్రత్త…